sp bhaskar bhushan
-
అలక పాన్పుపైనే..
♦ ఇద్దరు గన్మెన్లను వెనక్కి పంపిన చింతమనేని ♦ ప్రభుత్వ ఆదేశాల అనంతరమే నిర్ణయమన్న ఎస్పీ సాక్షి ప్రతినిధి, ఏలూరు : మంత్రి పదవి ఇవ్వలేదని అలకపాన్పు ఎక్కిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా దిగిరాలేదు. తనకు ఇద్దరు గన్మెన్లు చాలంటూ.. ఇద్దర్ని వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చింతమనేనికి 2+2 పద్ధతిలో నలుగురు గన్మెన్లు భద్రతగా ఉన్నారు. వీరిలో ఇద్దరు విధుల్లో ఉంటే.. ఇద్దరు విశ్రాంతిలో ఉంటారు. తనకు ఇద్దరు గన్మెన్లు చాలని, మిగిలిన ఇద్దరిని వెనక్కి పంపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేనందున ఆ ఇద్దరిని కూడా విధులు నిర్వహించాలంటూ జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తిరిగి చింతమనేని వద్దకు తిప్పి పంపారు. ప్రభుత్వం నుంచి అదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, ఆదేశాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంతో తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన చింతమనేని నేరుగా అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ పంపించిన విషయం విదితమే. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిసిన ఆయన పార్టీకి కట్టుబడి ఉంటానని, నిబద్ధతతో పనిచేస్తానంటూ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఇది జరిగిన 24 గంటలకే తనకు కల్పించిన భద్రతను సగానికి తగ్గించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో ఆయన మరో పరిణామానికి తెరతీయడంతో వ్యవహారం మొదటికొచ్చినట్టయ్యింది. అసలు చింతమనేని ఏం చేయాలనుకుంటున్నారు, తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఏవిధంగా ముందుకు వెళతారనే అంశాలపై చిక్కుముడి వీడటం లేదు. ఇద్దరు గన్మెన్లను ఉపసంహరించుకోవడంపై చింతమనేని ప్రభాకర్ స్పందిస్తూ తనకు ప్రజలే రక్షణగా ఉంటారని, గన్మెన్లు అవసరం లేదని నిశ్చయించుకున్నట్టు వ్యాఖ్యానించారు. -
అరచేతిలో నేరగాళ్ల చిట్టా
► నేరస్తుల వివరాలు కంప్యూటరీకరణ ► పోలీసు శాఖ ప్రత్యేక యాప్ ► 90 శాతం పనులు పూర్తి ఏలూరు అర్బన్ : నేర నియంత్రణపై దృష్టి సారించిన పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నేరాల నిరోధానికి గతంలో అమలు చేసిన సాధారణ పరిశోధనలకు సాంకేతికను జోడిస్తున్నారు. దీనిలో భాగంగా పోలీసుశాఖ ప్రత్యేకతలు ఉన్న కొత్త యాప్‌ను రూపొందించుకుంది. దీంట్లో నేరస్తుల చరిత్రను నిక్షిప్తం చేయడంతో పాటు నేరగాళ్ల వేలిముద్రలు, ఆధార్ సంఖ్య పొందుపరుస్తున్నారు. ఇలా తయారైన యాప్‌ను రాష్ట్ర పోలీసు కార్యాలయంలోని కంప్యూటర్లోనే కాకుండా అన్ని పోలీసు కార్యాలయాల్లో, పోలీసుల వాడే స్మార్ట్ఫోన్లలో కూడా ఇన్స్టాల్ చేస్తారు. దీని వలన పోలీసులకు అనుమానితులు ఎదురైతే వెంటనే యాప్‌ను యాక్టివేట్ చేస్తే నేరగాళ్ల చరిత్ర సులభంగా తెలుస్తుంది. ఇలా అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పంచుకునేందుకు పోలీసు శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఆధార్ నంబర్, వేలిముద్రల ఆధారంగా..: యాప్ అమలులోకి వస్తే నేరస్తుడి ఆధార్ నంబర్ లేదా వేలిముద్ర స్మార్ట్‌ఫోన్‌లో ఎంటర్ చేయగానే పూర్తి జాత కం స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంతో నేర విచారణ పద్ధతుల అవసరం ఉండబోదనేది పోలీసుల భావన. దీనిని దృష్టిలో ఉంచుకుని నేరస్తుల పూర్తి వివరాలను కంప్యూటరీకరించేందుకు సిద్ధం చేస్తున్నారు. దందాలో భాగంగా ఇతరులను బెదిరించడం, భూ కబ్జాలు, తగాదాలు, ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేయడం, దొంగతనాలు, బ్లాక్‌మెయిలింగ్, కిడ్నాప్‌లకు పాల్పడటం వంటి పలు నేరాలకు సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ కళ్ల ముందు సాక్షాత్కరించేలా అన్ని వివరాలు సమగ్రంగా కంప్యూటర్లో నిక్షిప్తం చేసి అనంతరం ఇంటర్నెట్తో అనుసంధానించే పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో నేరాల నియంత్రణ లక్ష్యం: నేరాలను పూర్తిస్థాయిలో నివారించడం, అదుపుచేయడం పోలీసుల ఏకైక లక్ష్యం. దీనిలో భాగంగా పోలీసులు ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేందుకు యాప్ రూపకల్పన చేసుకున్నాం. దీని ద్వారా నేరస్తులను గుర్తించడం, కేసులను ఛేదించడ సులభమని భావిస్తున్నాం. అసలు నేరాలే జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం యాప్ అంతమ లక్ష్యం. –భాస్కర్‌భూషణ్, ఎస్పీ -
బాధితులకు న్యాయం చేసే అదృష్టం పోలీసులదే
ఏలూరు అర్బన్ : సమాజంలో ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడే అవకాశం పోలీసులకు మాత్రమే లభించే గొప్ప అవకాశమని జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ అన్నారు. ఆదివారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు.ఒత్తిళ్ల మధ్య విధి నిర్వహణలో పోలీసు ఉద్యోగం నిజమైన కత్తిసాము అని ఎస్పీ అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఎస్సైలు పి.పోతురాజు, పీవీవీ కుమార్, కె.నాగేశ్వరరావు, జి.లీలావతి, పి.రాజు, హెచ్‌సీ కేవీఆర్.కృష్ణ, కానిస్టేబుళ్లు బి.సత్యనారాయణ, ఎండీఎస్ గోరి, ఎస్వీ.ప్రసాద్, డీఎస్.నారాయణలకు శుభాకాంక్షలందించారు. ఏలూరు డీఎస్పీ, గోగుల వెంకటేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ, పి.భాస్కరరావు,సంఘం అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుని నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజ్‌లో ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు సభను గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రోడ్డుపై వాహనం నడిపే ప్రతి చోదకుడూ అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా వారితో పాటు ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడకుండా నివారించ వచ్చన్నారు. ప్రమాదాల నివారణ కోసం ప్రతి నెలా రహదారి భద్రతా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తనతో పాటు కలెక్టర్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, ఉపరవాణాశాఖాధికారి సమావేశంలో పాల్గొని తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నామని చెప్పారు. ప్రమాద సంఘటనల్లో తప్పు ఎవరిదైనా డ్రై వర్లే బాధ్యత వహించాల్సి వస్తోందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్.ధనుంజయరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రై వర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాల వల్ల బాధితులకు సంస్థ లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తోందన్నారు. డ్రై వర్లు తమ అభిరుచులు మార్చుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి బస్సులు నడపడం ద్వారా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు. డ్రై వర్లు ఆధ్యాత్మిక చింతనతో, యోగా, వ్యాయామం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం పొందాలని సూచించారు. జిల్లా పరిధిలో ఆర్టీసీ డ్రై వర్ల కారణంగా జరిగిన ప్రమాదాల వల్ల గతేడాది 21 మంది మతిచెందగా ఈ ఏడాదిలో ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. ప్రమాదరహితంగా డ్రై వింగ్ చేసిన ఉత్తమ డ్రై వర్లకు ఎస్పీ భాస్కర్‌భూషణ్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆర్టీసీ డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ ఎం.నాగేశ్వరరావు, కార్మిక సంఘాల నాయకులు, డ్రై వర్ల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు పశ్చిమ రీజియన్ స్థాయిలో.. ఆర్ఎన్ రావు, బీవీఆర్‌ఎం రావు, ఎన్వీ ప్రసాదరావు (ఏలూరు డిపో) డిపో స్థాయిలో.. ఏలూరు: జేవీఎన్వీ ప్రసాద్, ఎంఎస్ నారాయణ, కేడీ రావు జంగారెడ్డిగూడెం : ఎస్కే మొహిద్దీన్, బీఆర్ కష్ణ, కె.అబ్రహం తాడేపల్లిగూడెం: జీఎస్సీహెచ్ రావు, పి.కుశరాజు, ఎన్ఎన్వీవీ కుమార్ తణుకు: సీహెచ్ శ్యాంసన్, ఎంపీ రావు, కేఎన్ రావు నరసాపురం: కేవీ రత్నం, జీవీ రావు, పి.మంగపతిరావు భీమవరం: టీఎస్ బాబా, ఈఎల్ రావు, వీవీ రావు కొవ్వూరు: ఎంబీ రావు, ఎస్కే అహ్మద్, టీవీ రాజు నిడదవోలు: ఎస్కేఏ బాషా, పీఎన్ రావు, పీఎస్ రావు వీరితో పాటు ప్రమాద రహిత డ్రై వింగ్‌లో డ్రై వర్లను ప్రోత్సహించిన కొవ్వూరు, నిడదవోలు డిపో మేనేజర్లు, సేఫ్టీ డ్రై వింగ్ ఇన్స్ట్రక్టర్లకు బహుమతులు అందజేశారు. -
దొరికితే దొంగ.. దొరక్కపోతే..
దొరికితే దొంగ.. దొరక్కపోతే పోలీస్.. సారీసారీ దొర.. ఒక గ్రామంలో నిత్యం కోడి పందాలు జరుగుతున్నాయి. పోలీసులు ఆ వ్యవహారాన్ని ‘మామాళ్లు’గానే పట్టించుకోవడం లేదు. అయితే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు (ఎస్బీ) విషయం తెలిసి దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో మన పోలీసులకు దాడులు చేయక తప్పింది కాదు. ఆ దాడుల్లో 10 మందిని అరెస్టు చేసి సుమారు రూ.3 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో అలవాటులో పొరపాటుగా ఏదో అటూఇటూగా రూ.2 లక్షల పైగా సొమ్ము తక్కువ చూపారు. ఈ విషయం డిపార్టమెంట్లో ఆ నోట ఈ నోట.. నాని.. చివరకు ఎస్పీకి చెవికి చేరింది. దీంతో ఆయన సీరియస్ అయ్యి ఎస్బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన మన పోలీసులు తెగులు సోకిన కోడిలా విలవిల్లాడిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వివరాలేంటో చూద్దామా? ఏలూరు (సెంట్రల్) : చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలోని ఒక కోడి పందాల శిబిరంపై ఇటీవల పోలీసులు ఆకస్మిక దాడిలో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో సొమ్మును పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పెషల్ బ్రాంచ్ అధికారులను(ఎస్బీ) విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొద్దికాలంగా వెంకటాపురంలో రోజూ కోడి పందాలు నిరాటంకంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పందాలపై అక్కడి పోలీసులు ఎటువంటి దాడులు నిర్వహించకపోవడంతో విషయం ఎస్బీ అధికారులకు తెలిసింది. వెంటనే దాడులు నిర్వహించాలని చింతలపూడి పోలీసులను ఆదేశించారు. ఆ సొమ్ములు కోళ్లు ఎత్తుకుపోయాయా? ఈ క్రమంలో ఈ నెల 23న చింతలపూడి పోలీసులు వెంకటాపురం గ్రామంలో కోడి పందాల స్థావరంపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.66,750, రెండు కార్లు, నాలుగు మోటారు సైకిళ్లు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఐఆర్లో చూపించారు. అయితే ఈ దాడుల్లో 10 మంది దగ్గర నుంచి రూ.మూడు లక్షలు వరకు స్వాధీనం చేసుకుని రూ. 66,750 మాత్రమే లెక్కల్లో చూపించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు లెక్కల్లో తేడాలు ఉన్నాయని అక్కడి నిఘా వర్గాలు ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన చింతలపూడి పోలీసులు అధికారులపై ఎస్బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. పోలీసులు నిర్వహించిన దాడిలో దొరికిన ఓ కాంట్రాక్టరు దగ్గర నుంచే పోలీసులు రూ.లక్ష వరకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఎస్పీ ఈ విషయంపై సీరియస్‌గా ఉండడంతో సదరు కాంట్రాక్టరుకు తిరిగి డబ్బులు ఇచ్చేందుకు అక్కడే ఓ అధికారి వద్ద పంచాయతీ పెట్టారని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారీ మొత్తాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై జిల్లా పోలీసు బాస్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి. -
వణుకు పుట్టిస్తున్న ఇంజక్షన్ సైకో
ఏలూరు : ఇంజక్షన్ సైకో దాడుల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోజురోజుకూ ఇంజక్షన్ సైకో దాడులు పెరిగిపోతున్నాయి. మరోపక్క సైకో దాడులు గోదావరి జిల్లాల ప్రజలకే కాదు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నది వాస్తవం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, దువ్వలో ఇంజక్షన్ సైకో సంచారం చేస్తున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. సైకోను పట్టుకోబోయిన వ్యక్తి నుంచి దాడులకు పాల్పడుతున్న ఇంజక్షన్ సైకో తప్పించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే, సైకోను ఓ వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించగా సిరంజీలు, చెప్పులు అక్కడి వదిలి పారిపోయాడని ఆ ప్రాంతాల వాళ్లు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిన్న కూడా రఘునాథ్ అనే వ్యక్తిపై సైకో దాడి చేశాడన్న విషయం విదితమే. సైకోకు మరో వ్యక్తి కూడా సహాయం చేస్తున్నాడని రఘు ఆరోపిస్తున్నాడు. మోటార్ సైకిల్‌పై వీళ్లిద్దరూ తిరుగుతూ ఈ దాడులు చేస్తున్నారని చెప్పాడు. పెనుగొండ ఎస్సై మాత్రం ఆ వ్యక్తి చెప్పిన విషయాలు అవాస్తవాలని కొట్టిపారేయడం గమనార్హం. ఇంజక్షన్ దాడుల నేపథ్యంలో సైకోను పట్టించిన వారికి రూ.50 వేలు అందిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గతంలో ప్రకటించిన విషయం విదితమే. -
సూది సైకో దొరికినట్లేనా?
-
సూది సైకో దొరికినట్లేనా?
పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న 'సూది సైకో' దొరికాడా.. లేదా అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈనెల 26వ తేదీ తర్వాత జరిగిన ఇంజక్షన్ దాడులన్నీ అబద్ధపు కేసులని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. పొడిచిన ఇంజెక్షన్లలో ఎలాంటి మత్తుపదార్థం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గ్రామాల్లో తాము రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకుంటామని, ఇప్పటివరకు సూది సైకో దాడులకు సంబంధించి 11 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ప్రజలు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన 'సూది సైకో'ను పోలీసులు ఇంతకీ అదుపులోకి తీసుకున్నారా.. లేదా అనేది తెలియడంలేదు. 26 తర్వాతి కేసులన్నీ అబద్ధాలేనని ఎస్పీ అంటున్నారంటే, ఆరోజే సూది సైకో పోలీసుల అదుపులోకి వెళ్లినట్లు అర్థం చేసుకోవాలి. కానీ, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించడం లేదు. రాజమండ్రిలో ట్రావెల్స్‌లో పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి సైకో అని, అతడిని పట్టుకున్నారని కొందరు పోలీసులు అన్నారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో సైకోను అదుపులోకి తీసుకున్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఇలా.. భిన్న కథనాలు వస్తున్నాయే తప్ప, అసలు సూది సైకో పోలీసులకు పట్టుబడ్డాడా లేదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కావడంలేదు. -
సిరంజీ సైకోను పట్టిస్తే 50వేలు..
ఏలూరు : మహిళలపై ఇంజక్షన్ దాడులకు పాల్పడుతున్న సైకో సమాచారం అందించిన వారికి రూ.50 వేల బహుమతి అందిస్తామని పశ్చిమ గోదావరి ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 ప్రత్యేక బృందాలు, 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మహిళలపై ఇంజక్షన్ దాడులను సీరియస్‌గా తీసుకున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 9 కేసులు నమోదయ్యాయని చెప్పారు. బాధితుల సమాచారం ప్రకారం ఊహాచిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. కంట్రోల్ రూమ్ నంబర్ 100, లేదంటే 9440796600 నంబర్ కు నిందితుని సమాచారం ఇవ్వాలని తెలిపారు. నిందితుడు ఉపయోగిస్తున్నది నీడిల్ మాత్రమే, అందులో ఎలాంటి మందులేదని నిర్ధారించినట్లు ఎస్పీ వివరించారు. సైకో చర్యలపై ఎవరూ ఆందోళన చెందొద్దని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని భాస్కర్ భూషణ్ అన్నారు. -
మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఏలూరు అర్బన్ : మానవ అక్రమ రవాణా అత్యంత హేయమని, దానిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ భాస్కర్ భూషణ్ స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక హెల్ప్ సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. మానవ అక్రమ రవాణాలో జిల్లా రాష్ట్రంలో ముందువరుసలో ఉండడం బాధాకరమని ఎస్పీ తెలిపారు. దానిని నియంత్రించేందుకు, కారకులను గుర్తించి వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇప్పటివరకు తాము గుర్తించిన కేసుల్లో మహిళలు 59 శాతం, బాలికలు 17 శాతం కాగా బాలురు 10 శాతంగా ఉన్నారని వివరించారు. ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాదారులు పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఉపాధి పేరిట మోసగించి గల్ఫ్ దేశాలకు తరలించి వారిని బలవంతాన వ్యభిచార కూపాల్లో నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద వర్గాలకు చెందిన మహిళలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా మెలగాలని సూచించారు. బాలల సంక్షేమ న్యాయమూర్తుల పీఠం చైర్మన్ టీఎన్ స్నేహన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. బాలల రక్షణ విషయంలో సీడ బ్ల్యుసీదే తుది నిర్ణయంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎస్పీ మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో సూర్యచక్రవేణి, డీసీఆర్బీ డీఎస్పీ పైడేశ్వరరావు, సీడబ్ల్యుసీ సభ్యులు పి.విజయనిర్మల, యు.రాజ్‌కుమార్, ఎస్ఎన్ కట్టా తదితరులు పాల్గొన్నారు. -
జల్సాల కోసం గొలుసు చోరీలు
-
జల్సాల కోసం గొలుసు చోరీలు
ఏలూరు (సెంట్రల్): జల్సాల కోసం గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులు, ఒక మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 562 గ్రాముల బంగారు వస్తువులను, నేరాలకు ఉపయోగించిన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు పాలిటెక్నిక్, ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. ఏలూరులోని తన కార్యాలయంలో బుధవారం కేసు వివరాలను ఎస్పీ భాస్కర్‌భూషణ్ విలేకరులకు వివరించారు. నిడమర్రు మండలం బావాయిపాలెంకు చెందిన మండపాక నాగేంద్ర కృష్ణబాబు (20) ఇంటర్మీడియెట్ చదువుతూ మధ్యలో మానివేశాడు. వ్యసనాలకు బానిసై మోటార్ సైకిల్‌పై వెళుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. కొంతకాలం తర్వాత గణపవరం వెలమపేటకు చెందిన చిప్పాడ వంశీ (20), తోటవారి వీధికి చెందిన శెట్టి సాయికుమార్ (20), గణపవరం మండలం వరదరాజపురం గ్రామానికి చెందిన సూరిబోయిన వెంకట విజయ్‌కుమార్ (19), మరో మైనర్ బాలుడితో కలిసి గ్యాంగ్‌గా ఏర్పడ్డాడు. వీరంతా మోటార్‌సైకిళ్లపై తిరుగుతూ ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలోని బంగారు వస్తువులను దొంగిలించేవారు. ఇలా తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, నల్లజర్ల, ఇరగవరం, తణుకు రూరల్, భీమవరం, కాళ్ల, కొవ్వూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో సుమారు 26 చోరీలకు పాల్పడ్డారు. బంగారు వస్తువులను అమ్మి వచ్చిన సొమ్ములతో విలాసవంతంగా గడిపేవారు. కృష్ణబాబు ప్లాన్ ప్రకారమే.. దొంగతనాలు చేసే విషయంలో ముఠా నాయకుడు కృష్ణబాబు ప్లాన్ ప్రకారమే మిగిలిన వారు నడుచుకునేవారు. కృష్ణబాబు దొంగతనానికి వెళ్లినప్పుడల్లా ఒకరిని వెంట తీసుకువెళ్లేవాడు. రెండు రోజులపాటు ఆయూ ప్రాంతాల్లో నిఘా పెట్టి పరిశీలించేవారు. ఆ తర్వాత సమయం చూసుకుని ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసేవారు. చోరీలు చేసి వచ్చిన సొత్తును అమ్మి జల్సాలు చేసుకునేవారు. వీరిలో వంశీ భీమవరంలో పాలిటెక్నిక్, సారుుకుమార్, విజయ్‌కుమార్ తాడేపల్లిగూడెంలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. మైనర్ బాలుడు ఇంటి వద్ద ఉంటూ కూలి పనులకు వెళుతుంటాడు. దొరికిందిలా.. తాడేపల్లిగూడెంలోని యాగరపల్లి ఓవర్ బ్రిడ్జ్‌పై బుధవారం పోలీసులు తనిఖీ చేస్తుండగా దొంగతనానికి వెళ్లి తిరిగి వస్తున్న కృష్ణబాబు మరో యువకుడు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. చోరీల విషయూలు బయటపడటంతో మిగిలిన యువకులు, మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 26 కేసులకు సంబంధించి సుమారు రూ.14 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కొవ్వూరు డీఎస్పీ ఎన్.వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం టౌన్ సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్సైలు సీహెచ్ కొండలరావు, క్రైమ్ ఎస్సై ఎంవీ పురుషోత్తమ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇద్దరు దొంగలు అరెస్ట్ చాగల్లు పోలీసుస్టేషన్ పరిధిలో దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రూ.1.30 లక్షలు, రూ.85 వేల విలువైన దుస్తులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. చాగల్లు మండలం చంద్రవరం గ్రామానికి చెందిన ఆకుల నందిరాజు, మల్లవరం గ్రామానికి చెందిన రాయుడు నరేష్ చాగల్లులోని పలు వస్త్ర దుకాణాలు, సెల్షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. స్థానికులకు వీరిపై అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు బయటపడ్డారుు. దొంగతనాలను చేధించిన నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ, చాగల్లు ఎస్సై ఎం.జయబాబును ఎస్పీ అభినందించారు. సూపర్బజార్లో చోరీ కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మెయిన్‌రోడ్డులోని వినాయక శ్రీనివాస సూపర్బజార్లో బుధవారం వేకువజామున చోరీ జరిగింది. దుకాణానికి వెనుక ఉన్న తలుపులు పగులగొట్టి దుండగులు లోనికి చొరబడ్డారు. రూ.25 వేల నగదు, రూ.10 వేల విలువైన కిరాణా సామాన్లు చోరీకి గురైనట్టు యజమాని కొల్లూరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు 50 మీటర్ల దూరంలో ఎదురుగా దుకాణం ఉండటం గమనార్హం. -
మావోయిస్టుల డంప్ స్వాధీనం
బెల్లంపల్లి : ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం బీరల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసు లు మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ భాస్కర్ భూషణ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాంబు డిస్పోజబుల్, సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి పోలీసులు బీరల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించగా టేకు, వెదురు చెట్ల మధ్యన డంప్ వెలుగు చూసింది. నాలుగు టిఫిన్ బాక్స్‌లు, 303 తపంచాలు రెండు, పాయింట్ 22 తుపాకీ, వాటి తూటాలు, హ్యాండ్ గ్రేనెడ్స్ రెండు, వెబ్బెల్ట్స్ 23, విజిల్స్ 23, ఒక ఎయిర్ ఫిస్టల్, ఏకే 47, 303, 8ఎంఎం తూటాలు 44, విప్లవ సాహిత్యం పోలీసులకు పట్టుబడ్డాయి. వీటిని సుమారు ఐదేళ్ల క్రితం మావోయిస్టు ఆదిలాబాద్ ఏరియా కమి టీ అగ్ర నేతలు దాచిపెట్టి ఉంటారని అడిషనల్ ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు.