
సూది సైకో దొరికినట్లేనా?
పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న 'సూది సైకో' దొరికాడా.. లేదా అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈనెల 26వ తేదీ తర్వాత జరిగిన ఇంజక్షన్ దాడులన్నీ అబద్ధపు కేసులని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న 'సూది సైకో' దొరికాడా.. లేదా అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈనెల 26వ తేదీ తర్వాత జరిగిన ఇంజక్షన్ దాడులన్నీ అబద్ధపు కేసులని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. పొడిచిన ఇంజెక్షన్లలో ఎలాంటి మత్తుపదార్థం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గ్రామాల్లో తాము రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకుంటామని, ఇప్పటివరకు సూది సైకో దాడులకు సంబంధించి 11 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ప్రజలు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన 'సూది సైకో'ను పోలీసులు ఇంతకీ అదుపులోకి తీసుకున్నారా.. లేదా అనేది తెలియడంలేదు. 26 తర్వాతి కేసులన్నీ అబద్ధాలేనని ఎస్పీ అంటున్నారంటే, ఆరోజే సూది సైకో పోలీసుల అదుపులోకి వెళ్లినట్లు అర్థం చేసుకోవాలి. కానీ, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించడం లేదు. రాజమండ్రిలో ట్రావెల్స్లో పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి సైకో అని, అతడిని పట్టుకున్నారని కొందరు పోలీసులు అన్నారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో సైకోను అదుపులోకి తీసుకున్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఇలా.. భిన్న కథనాలు వస్తున్నాయే తప్ప, అసలు సూది సైకో పోలీసులకు పట్టుబడ్డాడా లేదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కావడంలేదు.