► నేరస్తుల వివరాలు కంప్యూటరీకరణ
► పోలీసు శాఖ ప్రత్యేక యాప్
► 90 శాతం పనులు పూర్తి
ఏలూరు అర్బన్ : నేర నియంత్రణపై దృష్టి సారించిన పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నేరాల నిరోధానికి గతంలో అమలు చేసిన సాధారణ పరిశోధనలకు సాంకేతికను జోడిస్తున్నారు. దీనిలో భాగంగా పోలీసుశాఖ ప్రత్యేకతలు ఉన్న కొత్త యాప్‌ను రూపొందించుకుంది. దీంట్లో నేరస్తుల చరిత్రను నిక్షిప్తం చేయడంతో పాటు నేరగాళ్ల వేలిముద్రలు, ఆధార్ సంఖ్య పొందుపరుస్తున్నారు. ఇలా తయారైన యాప్‌ను రాష్ట్ర పోలీసు కార్యాలయంలోని కంప్యూటర్‌లోనే కాకుండా అన్ని పోలీసు కార్యాలయాల్లో, పోలీసుల వాడే స్మార్ట్‌ఫోన్లలో కూడా ఇన్‌స్టాల్ చేస్తారు. దీని వలన పోలీసులకు అనుమానితులు ఎదురైతే వెంటనే యాప్‌ను యాక్టివేట్ చేస్తే నేరగాళ్ల చరిత్ర సులభంగా తెలుస్తుంది. ఇలా అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పంచుకునేందుకు పోలీసు శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తుంది.
ఆధార్ నంబర్, వేలిముద్రల ఆధారంగా..: యాప్ అమలులోకి వస్తే నేరస్తుడి ఆధార్ నంబర్ లేదా వేలిముద్ర స్మార్ట్‌ఫోన్‌లో ఎంటర్ చేయగానే పూర్తి జాత కం స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంతో నేర విచారణ పద్ధతుల అవసరం ఉండబోదనేది పోలీసుల భావన. దీనిని దృష్టిలో ఉంచుకుని నేరస్తుల పూర్తి వివరాలను కంప్యూటరీకరించేందుకు సిద్ధం చేస్తున్నారు. దందాలో భాగంగా ఇతరులను బెదిరించడం, భూ కబ్జాలు, తగాదాలు, ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చి సెటిల్‌మెంట్‌లు చేయడం, దొంగతనాలు, బ్లాక్‌మెయిలింగ్, కిడ్నాప్‌లకు పాల్పడటం వంటి పలు నేరాలకు సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ కళ్ల ముందు సాక్షాత్కరించేలా అన్ని వివరాలు సమగ్రంగా కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి అనంతరం ఇంటర్‌నెట్‌తో అనుసంధానించే పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి.
పూర్తిస్థాయిలో నేరాల నియంత్రణ లక్ష్యం: నేరాలను పూర్తిస్థాయిలో నివారించడం, అదుపుచేయడం పోలీసుల ఏకైక లక్ష్యం. దీనిలో భాగంగా పోలీసులు ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేందుకు యాప్ రూపకల్పన చేసుకున్నాం. దీని ద్వారా నేరస్తులను గుర్తించడం, కేసులను ఛేదించడ సులభమని భావిస్తున్నాం. అసలు నేరాలే జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం యాప్ అంతమ లక్ష్యం. –భాస్కర్‌భూషణ్, ఎస్పీ