గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారం విషం కక్కుతోంది. పాలక పార్టీకి ఓ రూలు, ప్రతిపక్షానికో రూలు అన్నట్టుగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి, వారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టనున్న నిరసన ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమానికి 144 సెక్షన్‌తో మోకాలడ్డారు.
సాక్షి, నరసరావుపేట : పట్టణంలో అధికార యంత్రాంగం, పారదర్శకతకు పాతరేసి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటోంది. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనపై వచ్చిన విమర్శలను నిగ్గు తేల్చుకునేందుకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట పోలీసులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ బహిరంగ చర్చకు వెళ్లకుండా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని గృహనిర్బంధం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. దీంతో నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అడ్డుకోవడమే లక్ష్యం : నరసరావుపేట, సత్తెనపల్లిలో జరిగిన అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని, లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకుంటే టీడీపీ నేతలు రాజీనామాకు సిద్ధపడాలని గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పట్టణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. అయితే బహిరంగ సభలో ప్రతిపక్ష నాయకులు నోరు విప్పితే తమ అవినీతి ఎక్కడ బట్టబయలు అవుతుందోనన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుంది.
బహిరంగ సభ, ర్యాలీలను ఎలాగైనా అడ్డుకోవాలనకున్న అధికార పార్టీనేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మూడురోజుల పాటు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు నిషేధిత ప్రాంతమైన ఆర్డీవో ఆఫీసు సెంటర్‌లో ఆందోళన జాతర చేపట్టినప్పుడు అధికారులకు గుర్తుకురాని నిబంధనలు ప్రతిపక్షం ర్యాలీ చేస్తానన్నప్పుడు మాత్రం అకస్మాత్తుగా గుర్తుకువచ్చాయి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి 144 సెక్షన్ పేరుతో మోకాలడ్డారు. అధికారులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది?
144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టనున్న నేపథ్యంలో ఇన్‌చార్జి తహసీల్దార్ జి.శ్రీనివాస్ 144 సెక్షన్ అమలు చేయాలని శుక్రవారం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సాకును అసరాగా చూపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ర్యాలీకు అనుమతులు ఇవ్వకూడదనేది అధికార పార్టీ కుట్ర. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులు మూడు రోజుల పాటు న్యాయస్థాన ప్రాంగణాలకు కూతవేటు దూరంలో గల ఆర్డీవో అఫీసు సెంటర్‌లో నానా యాగీ చేసినా, ప్రజలు, వ్యాపారస్తులు మూడు రోజుల పాటు ఇబ్బందులు పడినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు మాత్రం ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. దీని వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉందని తేటతెల్లమవుతోంది.
నాలుగో తేదీ వరకు 144 సెక్షన్ అమలు : ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో 144 సెక్షన్ అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ కోరిన నేపథ్యంలో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశా. జూన్ 30 నుంచి జూలై 4వ తేదీ వరకు ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. –శ్రీనివాస్, తహసీల్దార్
ఉన్నతాధికారుల దృష్టికి సమస్య : ఏఈఎల్‌సీ ఆస్తుల అన్యాక్రాంతం వ్యవహారంలో రాజకీయ సవాళ్ల వివాదం శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉంది. 144 సెక్షన్ అమల్లో వున్న కారణంగా నిరసనలు, బహిరంగ సభలు నిషేధం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. –ఏవీ శివప్రసాద్, సీఐ
తహసీల్దార్ జారీచేసిన 144 సెక్షన్ ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment