నరసరావుపేట: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతును వినపడనీయకుండా అణచివేయాలనుకోవటం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. నరసరావుపేట నియోజకవర్గంలో అవినీతికి చిరునామాగా కోడెల కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. నరసరావుపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన సభను జరగనీయకుండా తనతో పాటు కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడుతో కలసి పాత్రికేయులతో మాట్లాడారు. స్థల వివాదంలో తాను లూథరన్ అంధుల పాఠశాల ఉన్న ఏఈఎల్‌సీ సంస్థ చైర్మన్‌ను కలిశానని చెప్పారు. ఆయన తాము ఎవ్వరికీ లీజుకు ఇవ్వలేదని చెప్పారన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న వారు కూడా శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ తాము లీజుకు తీసుకోలేదని, కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారన్నారు. తాము లీజుకు తీసుకున్నట్లు డాక్యుమెంట్ తీసుకొస్తే వెంటనే తమ ఖర్చులతో తిరిగి రిజిస్ట్రేషన్ చేయిస్తామని వారు ప్రకటించారన్నారు.
ఈ వ్యవహారంలో నకిలీ లీజు అగ్రిమెంట్‌ను టీడీపీ నాయకులు సృష్టించారని గోపిరెడ్డి ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు సాయితేజ డెవలపర్స్ పేరుపై ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధం చేసుకున్నారని, దానిలో ఏడుగురు వ్యక్తుల పేర్లు ఉండగా అందులో ముగ్గురు టీడీపీకి చెందినవారని గోపిరెడ్డి వివరించారు. వారిపేర్లు బయటపెట్టకుండా కేవలం వైఎస్సార్‌సీపీకి చెందిన వారి పేర్లే బయటపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు.
గుంటూరులో సంగతి మాట్లాడరే ?
గుంటూరులో ఏఈఎల్‌సీకి చెందిన ఆరు ఎకరాలు మంత్రి నక్కా ఆనందబాబు చేతిలో ఉన్నాయని గోపిరెడ్డి చెప్పారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు చెందిన గ్రాండ్ హోటల్ నాగార్జున ఏఈఎల్‌సీ స్థలంలో నిర్మించినదేనని తెలిపారు. టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు స్థలం లీజుకు తీసుకొని రమేష్ హాస్పిటల్స్ నిర్మించేందుకు ఇచ్చారన్నారు. వీరందరూ టీడీపీకి చెందినవారేనని గుర్తు చేశారు. వీరు తీసుకున్నప్పుడు ఆందోళనలు, ఉద్యమాలు ఎందుకు చేయలేదని, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఇక్కడ కేవలం సంబంధం లేని వ్యవహారాన్ని తనకు చుట్టి తనపై బురదచల్లేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తనపై కల్తీ పాలు, టీటీడీ లేఖలు అంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారని, అయితే ఏ విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరినా వారు స్వీకరించటం లేదని గోపిరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం వారి చేతిలో ఉన్నా తనపై ఎందుకు కేసులు పెట్టటం లేదని ప్రశ్నించారు. తన ప్రమేయం లేదని తెలిసే కేసులు పెట్టలేదన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే కేసులు పెట్టాలని, ఏ స్థాయి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు.
అవినీతి సామ్రాట్ శివరాం
స్పీకర్ డాక్టర్ కోడెల కుమారుడు శివరామ్ అవినీతికి చిరునామాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. భూకబ్జాలు చేస్తున్న వ్యక్తే తమపై నిందలు మోపుతున్నాడన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాళ్ల గ్రామంలో సుబ్బారావుకు చెందిన 17 ఎకరాల భూమిని కబ్జా చేసి ఆ స్థలంలో ఉన్న రూ.2 కోట్ల ఆస్తిని ధ్వంసం చేశారన్నారు. ఏడు ఇళ్లు నాశనం చేసి సుమారు 10 వేల కోళ్లను తిన్నారన్నారు. నరసరావుపేట పలనాడు రోడ్డులో ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల అధ్యాపకుడికి చెందిన రూ.5 కోట్ల స్థలాన్ని, నల్లపాడులో సాంబిరెడ్డి అనే వ్యక్తికి చెందిన 2.5 ఎకరాల భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆరోపించారు.
తాను తిరుపతి పాదయాత్రకు వెళుతూ లక్షలు వసూలు చేశారనే శివరామ్ విమర్శలను ఎమ్మెల్యే గోపిరెడ్డి ఖండించారు. వెంకటేశ్వరస్వామి పాదయాత్రను కూడా రాజకీయం చేసిన దుర్మార్గుడు శివరామ్ అన్నారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లోఫర్స్ అంటూ శివరామ్ చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్‌కు వెళతామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేయకుండానే సత్తెనపల్లి, నరసరావుపేటలలో దోచుకున్న రూ.150కోట్ల డబ్బుతో గుంటూరులో కేఎస్‌పీ మాల్ నిర్మించారని తెలిపారు.
ముఖ్యమంత్రి హెచ్చరించినా రైల్వే కాంట్రాక్టర్ నుంచి రూ.5కోట్లతో పాటు సత్తెనపల్లిలో బాలాజీ స్వీట్స్ నుంచి నెలకు రూ.50వేలు వసూలు చేస్తున్నాడన్నారు. చివరకి తన పార్టీ కార్యకర్తలను కూడా వదలకుండా డబ్బులు వసూలుచేస్తూ వారే తనకు బలమని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక మాజీ ఎంపీపీ మట్టి తోలుకున్నాడని నాలుగు రోజుల పాటు జైలులో పెట్టించాడన్నారు. తన ఇంటిలో బాంబులు పేలి నలుగురు కార్యకర్తలు చనిపోతే ఇప్పటివరకు ఆ కుటుంబాలను ఆదుకోలేదని తెలిపారు. ఇటువంటి వ్యక్తికి ఆర్డీవో కార్యాలయం వద్ద పోలీసులు ఆరు గంటల పాటు మైకు ఇచ్చి స్టేజ్ ఏర్పాటు చేసుకుంటే తప్పు లేనిదీ... ఏ తప్పూ చేయని తాము సభ పెట్టుకుంటామంటే హౌస్ అరెస్టుచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏ నేరం చేశాడని అరెస్టు చేశారు: బొల్లా
వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఏ నేరం చేశాడని అరెస్టు చేశారంటూ ప్రశ్నించారు. డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని విధాలా ప్రజలను దోచుకుంటున్న వీరు అవినీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు నూరుల్ అక్తాబ్, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఏ.హనీఫ్, జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా పాల్గొన్నారు.
నరసరావుపేటలో నియంతృత్వ పాలన ?
నరసరావుపేట టౌన్: నరసరావుపేటలో నియంత పాలన కొనసాగుతుందా అన్నట్లు శనివారం వాతావరణం కనిపించింది. ఎటుచూసినా ఖాకీలు గుంపులు గుంపులుగా లాఠీలు పట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీనంతటికీ టీడీపీ నేతల అవినీతిపై ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసరటమే కారణంగా కన్పిస్తోంది. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తే ఎక్కడ తమ అవినీతి పుట్ట పగులుతుందోనని కలవరపాటుతో అధికార పార్టీ కుట్ర చేసి సభను భగ్నం చేసింది.
144 సెక్షన్ అస్త్రాన్ని ఉపయోగించి నియోజకవర్గ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో పట్టణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసి ఇతరులనెవ్వరిని అటుగా అనుమతించలేదు. దీంతో పాటు మల్లమ్మ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయ సెంటర్, పల్నాడు బస్టాండు, ఆర్టీసి బస్టాండు వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డుగా డివైడర్‌లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. అటుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. దీంతో ప్రజానీకం అసౌకర్యానికి గురైయ్యారు.
పోలీసుల అదుపులో పట్టణం
మూడు సబ్ డివిజన్‌ల అధికారులు, సిబ్బందితో పాటు గుంటూరు నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన సెంటర్‌లలో 10 నుంచి 20 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 10 వాహనాల్లో పోలీసులు గస్తీ తిరిగి జనాలను చెదరగొడుతూ భయబ్రాంతులకు గురిచేశారు. మరో ఐదు రోజుల పాటు పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న దృష్ట్యా పోలీసులు ఇదే అత్యుత్సాహం ప్రదర్శిస్తే జనజీవనం అస్తవ్యస్తం అవ్వటం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment