కుర్చీలు విరగ్గొట్టి జేసీ వర్గీయుల వీరంగం
అనంతపురం : జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తన ప్రతాపం చూపించారు. జేసీ వర్గీయుల రెచ్చిపోవటంతో అనంతపురం టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. అనంతపురం జిల్లాలో గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రషీద్ అహ్మద్ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరటంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ చేరికను అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. సమావేశం నుంచి పార్టీ కార్యకర్తలు బయటకు వెళ్లకపోవడంతో జేసీ అనుచరులు కుర్చీలు విరగ్గొట్టి హల్ చల్ చేశారు. లలిత కళాపరిషత్ లో నిర్వహించిన టీడీపీ సమావేశం రణరంగాన్ని తలపించింది. జేసీ వర్గీయలు వీరంగం వేసి ఫెక్సీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అవాక్కయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఓ దశలో జేసీ, ప్రభాకర్ చౌదరి వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.