సమస్యలపై ఆరా తీస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి
సాక్షి, విజయనగరం : తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞానవంతులో, అవివేకులో తెలియని పరిస్థితి నెలకొందని స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం విజయనగరంలోని 38వ వార్డు కొత్త అగ్రహారం, బూర్లపేట, గవర వీధి, గాజుల వీధి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలనలో ఏం జరిగిందంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తుంటే నవ్వొస్తోందన్నారు. ఐదేళ్లు పరిపాలించాలని టీడీపీకి అవకాశం ఇస్తే అవినీతి, చేతకాని పరిపాలన చూసి ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.
సమస్యలు వింటూ పరిష్కారం చూపుతూ..
వార్డు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్థానిక సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొత్త అగ్రహారంలో ఉన్న మున్సిపల్ క్వార్టర్స్ శిథిలావస్థకు చేరి పందులకు ఆవాసంగా మారడంతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బూర్లుపేటలో విద్యుత్ లైట్లు లేకపోవడం అంధకారం అలుముకుంటుందని, ఐరన్ స్తంభాలు షాక్ కొడుతున్నాయని ఆ ప్రాంత మహిళలు ఎమ్మెల్యే కోలగట్ల కు చెప్పగా, ఐరన్ పోల్స్ ప్రాంతంలో సిమెంటు స్తంభాలు వేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
పాడైన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వేయాలని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే కోలగట్లకు డాక్టర్ రమణమూర్తి, ఉడతా కాశీ, పసుమర్తి గణేష్, పువ్వాడ వర్ధన్, బొడ్డు కష్ణ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే కోలగట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వార్డు జోనల్ ఇంచార్జి కేదారిశెట్టి సీతారామమూర్తి(రాంపండు), వార్డు పార్టీ అధ్యక్షుడు పిల్లా వేణు, పిల్లా పాండురంగారావు, ఆడారి శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment