ఎమ్మెల్యే సొంత గ్రామస్తుడైతే పింఛన్ ఇవ్వరా?
ఐరాల: ‘ఎమ్మెల్యే సొంత గ్రామంలో నివాసముండే వారికి పింఛను ఇవ్వరా..?’ అంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఎంపీడీవో పార్వతమ్మను ప్రశ్నించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఎంపీడీవోను ఉద్దేశించి మాట్లాడారు. 20 ఏళ్లుగా పింఛన్ పొందుతున్న ఎంపైపల్లెకు చెందిన చెంగయ్యకు ఇటీవల కమిటీ సభ్యులు పింఛన్ తొలగించారన్నారు. ఆయన తనను సంప్రదించగా ఎంపీడీవోకు విన్నవించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలిపారు. ఆయన మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి చెందిన వారు కావడంతో పింఛన్ తొలగించి ఉంటారని బాధితుడు ఆలోచిస్తూ మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. వయస్సు మీరిన వారిని ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎంపీడీవో పార్వతమ్మ స్పందిస్తూ కమిటీ తొలగించిన తరువాత నిజానిజాలు పరిశీలించి పింఛనుదారుడి వివరాలను జిల్లా అధికారులకు తెలియజేశామన్నారు. అనుమతి రాగానే పింఛను అందజేస్తామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు పుత్రమద్ది బుజ్జిరెడ్డి, గురుమూర్తి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, దళిత సంఘం నాయకులు సిద్దయ్య, చెంగపల్లి ఎంపీటీసీ చిలకమ్మ, చిన్నారెడ్డి, గుర్రప్ప, గణపతి, భానుప్రకాష్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, అయిరాల ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.
ఎంపీపీనే బాస్
ఈ విషయంపై ఎంపీడీవో పార్వతమ్మను వివరణ కోరగా గతంలో ఉన్న ఎంపీడీవో, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కమిటీలో 160 మందిని అనర్హులుగా గుర్తించారని, ఆ తరువాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాటిని ఎమ్మార్వో సమక్షంలో పరిశీలించి తిరిగి నమోదు చేశామని తెలిపారు. వాటిని తొలగించడంలో చేర్చడంలో ఎంపీపీనే తమకు బాస్‌గా వ్యవహరించారని చెప్పారు.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
సమావేశం అనంతరం ఎమ్మెల్యే సునీల్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆమరణ నిరాహర దీక్ష చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా అర్హత ఉండి పింఛను కోల్పోయిన వారందరూ హాజరు కావాలని కోరారు.