గత ఏడాది నిర్వహించిన గ్రామ సభలో పంచాయతీ విభజన చేయాలంటూ ఎంపీడీఓ వెంకటనాయుడుకు రాతపూర్వకంగా వినతిని అందిస్తున్న గ్రామస్తులు
‘పంచాయతీ విభజన కావాలంటూ గ్రామ సభలో ఎవరైనా ఒప్పుకుంటే అంతుచూస్తాం... షావుకారికి వ్యతిరేకంగా మాట్లాడినా మీ ప్రాణాలు గాల్లో కలుస్తాయ్’ అంటూ రెండు రోజులుగా ఉరవకొండ నియోజకవర్గంలోని పెద్ద కౌకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పంచాయతీ విభజనను అడ్డుకుంటూ ప్రజలు నోరు మెదపకుండా పయ్యావుల అనుచరులు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
స్వాతంత్య్రం సిద్ధించి 70 సంవత్సరాలు పైబడినా.. ఇంకా ఈ ప్రాంతాలు భూస్వాముల కబంధహస్తాల్లోనే చిక్కుకున్నాయనేందుకు ఇంతకన్న నిదర్శనం ఏం కావాలి. ఇక్కడ వారు చెప్పిందే వేదం. వారి మాటను బేఖాతరు చేస్తే ఎంతటికైనా తెగిస్తారు. పయ్యావుల సోదరులు సాగిస్తున్న అరాచకాలతో కౌకుంట్ల పంచాయతీ ప్రజలు స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు.
సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ నియోజకవర్గంలోని పెద్ద కౌకుంట్ల గ్రామానికి రక్త చరిత్రే ఉంది. ఇక్కడ భూస్వాములదే రాజ్యం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై అభిమానంతో పెద్ద కౌకుంట్ల పంచాయతీలోని వై.రాంపురం గ్రామంలో సూరయ్య అనే వ్యక్తి తన ఇంటిపై కాంగ్రెస్ జెండా కట్టాడు. ఈ విషయాన్ని పయ్యావుల సోదరులు అప్పట్లో జీర్ణించుకోలేకపోయారు. వారి కనుసన్నల్లోనే సూరయ్యను అత్యంత దారుణంగా పెట్రోలు పోసి సజీవ దహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతోపాటు వైఎస్సార్ సీపీకి ఓటు వేశారన్న నెపంతో కౌకుంట్ల గ్రామంలోని దళితులపై విచక్షణారహితంగా పయ్యావుల అనుచరులు దాడులకు తెగబడ్డారు. దీని వెనుక కూడా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హస్తమున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలోనే వారి కబంధ హస్తాల నుంచి విముక్తి కోరుకుంటూ పెద్ద కౌకుంట్ల పంచాయతీ విభజనకు ప్రజలు పట్టుబట్టారు.
అడుగడుగునా అడ్డంకులు
పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో కౌకుంట్ల, వై.రాంపురం, మైలారంపల్లి, రాచపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మొత్తంగా 7,118 జనాభా ఉంది. 5,500 మంది ఓటర్లు ఉన్నారు. భూస్వాముల అరాచకాలను భరించలేక పెద్ద కౌకుంట్ల పంచాయతీని విభజన చేయాలంటూ గత ఏడాది ప్రభుత్వాన్ని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు అప్పట్లో గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రాతపూర్వకంగా అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై 2019, సెప్టెంబర్ 30న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామ సభను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే కేశవ్ ప్రమేయంతో అనచరులు గందరగోళాన్ని సృష్టించి అభిప్రాయాలను వెల్లడించకుండా ప్రజలను అడ్డుకున్నారు. పంచాయతీ విభజనకు అనుకూలంగా ఎవరూ చేతులెత్తకుండా పయ్యావుల గుండాలు పహారా కాశారు. అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగి, నివేదికను కలెక్టర్‌కు అందజేశారు.
దీనిపై విచారణ అనంతరం ఈ నెల 30న మరోసారి అభిప్రాయ సేకరణకు గ్రామసభ ఏర్పాటు చేయాలంటూ అధికారులను కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. పంచాయతీ విభజన జరిగితే తమ ఓటు బ్యాంక్‌కు దెబ్బపడడంతో పాటు, ఆయా గ్రామాల్లో తమ ఆధిపత్యానికి గండి పడుతుందని భావించిన పయ్యావుల వర్గం మరోమారు గ్రామసభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రెండు రోజులుగా పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి చీరలు, మద్యం బాటిళ్లను బలవంతంగా అంటగట్టి విభజనకు అనుకూలంగా చేతులెత్తితే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
చాలామంది ఊళ్లు వదులుతున్నారు
పంచాయతీ విభజన జరగకుండా పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు అడ్డుపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి విభజనకు వ్యతిరేకంగా చేతులెత్తాలని భయపెడుతున్నారు. దీంతో చాలా మంది ఊళ్లు వదిలి వెళుతున్నారు.
– సిద్దారెడ్డి, కౌకుంట్ల పంచాయతీ
భయబ్రాంతులకు గురిచేస్తున్నారు
గ్రామంలో ప్రజలను పయ్యావుల కేశవ్ అనుచరులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. డబ్బు, మందు బాటిళ్లు, చీరలు బలవంతంగా ప్రజలకు అంటగట్టి, పంచాయతీ విభజనకు వ్యతిరేకంగా చేతులు ఎత్తాలని చెబుతున్నారు.
– వసంతమ్మ, కౌకుంట్ల
ధైర్యంగా ముందుకు రండి
కౌకుంట్ల భూస్వాముల అరాచక పాలనకు స్వస్తి పలకడానికి పంచాయతీ ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలి. పంచాయతీ విభజనకు సంబంధించి వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్త పరచాలి. చీరలు, డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురికావద్దు.
– అశోక్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాకెట్ల
Comments
Please login to add a commentAdd a comment