గిరిజనుల రక్తాన్ని పీల్చేస్తున్న లంచాల జలగలు
► కేజీహెచ్ సిబ్బంది లంచాల జాడ్యం
► అసెంబ్లీలో కళ్లకు కట్టినట్టు వినిపించిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
► సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్
విజయనగరం కంటోన్మెంట్: పాపం గిరిజనం..రోగమొచ్చినా, ప్రమాదాల్లో గాయపడినా వైద్యం సక్రమంగా అందకపోవడంతోనే కాదు, ప్రభుత్వ వైద్యుల లంచాలతోనూ విలవిల్లాడుతున్నారు. వైద్యం కోసమే కాదు, చివరకు మృతదేహాన్ని తరలించడంలోనూ కేజీహెచ్‌లో పనిచేస్తున్న సిబ్బంది, వైద్యులు లంచాలు అడుగుతూ వారిని పిడిస్తున్నారు. వైద్య సిబ్బంది లంచాల జబ్బుకు మధ్య తరగతి ప్రజలు, చేతిలో చిల్లి గవ్వలేని అమాయక గిరిజనం మౌన వేదనతోనే అనుభవిస్తున్నారు.
కళ్లకు కట్టిన కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
అమాయక గిరిజనుల మౌనాన్ని అసెంబ్లీ సాక్షిగా కళ్లకు కట్టినట్టు వివరించారు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. సరైన సౌకర్యాలను పొందలేకపోవడం ఒకెత్తయితే, అంతే స్థాయిలో మోసానికి గురవుతుండడం మరోకెత్తని, కేజీహెచ్ సిబ్బంది గిరిజనాన్ని దోచుకుంటున్న విషయాన్ని సోమవారం అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకు వచ్చారామె. ఈ మేరకు కొన్ని ఉదాహరణలను స్పీకర్‌కు లెక్కలతో సహా వినిపించారామె. అలా ఆమె చెప్పిన లెక్కలన్నీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
మొత్తం 28 వేల ఖర్చు..
ఈ మేరకు ఆమె ఇటీవల గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో మరణించిన కొండగొర్రి ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి కుటుంబాన్ని వైద్య సిబ్బంది లంచాల కోసం వేధించిన తీరును వివరించారు. ప్రవీణ్ గత నెల 15న రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. ఆయన్ని వైద్యం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు రెఫర్ చేశారు. అంతే అక్కడి నుంచి ప్రవీణ్ కుటుంబీకులకు కష్టాలు మొదల్యాయి. పార్వతీపురం నుంచి కేజీహెచ్‌కు తరలించేందుకు అంబులెన్స్‌కు రూ.5 వేలు, కేజీహెచ్ స్కానింగ్ విభాగానికి రూ.2వేలు, ఐసీయూ కాపలా దారునికి రూ.వెయ్యి ఇచ్చారు. ఇంతలో ఆయన చనిపోయాడు.
అప్పుడైనా లంచాలు తీసుకోవడం ఆపేస్తారనుకుంటే పొరపాటే. పోస్టుమార్టం రిజిస్టర్‌లో ఎంటర్ చేయడానికి రూ.వెయ్యి, రిపోర్టు ఇచ్చేందుకు రూ.వెయ్యి, మృతదేహాన్ని ప్యాకింగ్ చేసేందుకు రూ. 3వేలు (క్లాత్ ఖర్చులతో కలిపి), డాక్టర్‌కు రూ.2వేలు, సాయం చేసిన తోటికి రూ.వెయ్యి, అక్కడి నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు అంబులెన్స్‌కు రూ.12వేలు చెల్లించారు. మొత్తం రూ. 28 వేలు ఖర్చు అయింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో హల్ చల్ చేస్తున్నాయి. గిరిజనం సమస్యను ఎమ్మెల్యే కేస్ స్టడీతో సహా అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.