
సారా తప్ప నీరు దొరకదు
ఎంఎల్‌ఏ రాజన్నదొర
సాలూరురూరల్: నియోజకవర్గంలో సారా దొరుకుతుంది కానీ తాగునీరు దొరకడం కష్టంగా మారిందని సాలూరు ఎంఎల్‌ఏ రాజన్నదొర అన్నారు. నియోజకవర్గం లోని పలువురు ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం ఆయనను కలిసి గ్రామాల్లో ప్రజలు నాటుసారాకు బానిసలుగా మారుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. దీనిపై ఎఎల్‌ఏ మాట్లాడుతూ ఒడిశా ఆంధ్ర సరిహద్దు గ్రామాల్లో సారా అధికంగా లభ్యమవుతోందన్నారు. ఒడిశా నుంచి అధికంగా సారాప్యాకెట్లు దిగుమతి అవుతున్నాయన్నారు.
యథేచ్ఛగా నాటుసారా లభ్యమవుతుండడం వెనుక ఉన్నవారిని అధికారులు ఎందుకు పట్టుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎక్సైజ్ అధికారులు తూతూమంత్రంగా సారాబట్టీలపై దాడులు నిర్వహిస్తున్నారని, చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్లనే సారా మహమ్మారి గ్రామాల్లో ప్రబలుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయంపై జెడ్పీ సమావేశంలో, శాసనసభ లో కూడా తప్పకుండా ప్రశ్నిస్తానని చెప్పారు. ఇకనైనా ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తును వీడి సారాను అరికట్టడానికి కృషిచేయాలని కోరారు.