
25నుంచి ఎమ్మెల్యే రవీంద్ర ఆమరణ దీక్ష
వీరపునాయునిపల్లెలో 25 నుంచి దీక్ష
కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
కమలాపురం అర్బన్ : తాగు, సాగు నీటి సమస్యలను తీర్చాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు కమలాపురం నియోజకవర్గ శాసన సభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రజలతో కలసి వీరపునాయునిపల్లె మండల కేంద్రంలో ఈ నెల 25 నుంచి ఆమరణ నిరహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. మార్చి 7 నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతాయని, ఈ బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గ నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ప్రభుత్వానికి ఉద్యమాలు, నిరసనలపై నమ్మకం ఉంటే గాలేరు-నగిరి సుజల స్రవంతికి నిదులను మంజూరు చేస్తుందనే ఆలోచనతో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జీఎన్‌ఎస్‌ఎస్ పూర్తి కావడానికి 2700 కోట్లు వ్యయం అవుతుందని, అందులో భాగంగా కడప జిల్లాకు 1400 కోట్లు, మిగిలిన జిల్లాలకు 1300 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కనీసం కడప జిల్లాకు తాగు,సాగు నీటి అవసరాలకు కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే ప్రాజెక్టు పూర్తి అవుతుందని చెప్పారు. పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి రాజుపాలెం సుబ్బారెడ్డి, నాయకులు సియస్ నారాయణరెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, యన్‌సి పుల్లారెడ్డి, సుధాకొండారెడ్డి, మారుజోళ్ళ శ్రీనివాసరెడ్డి, క్రిష్ణారెడ్డి, చిన్ని పాల్గొన్నారు.