మా ఆశలపై నీళ్లు.. టీడీపీ వాళ్లకు ఇళ్లు
సొంత ఇళ్లు ఇస్తారని ఎదురుచూస్తున్న తమ ఆశలపై నీళ్లు చల్లి అధికార పార్టీ కార్యకర్తలకు కేటాయిస్తున్నారని సింగ్‌నగర్‌కు చెందిన 150 మంది మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం ఎదుట వారంతా ఆందోళన చేశారు.
ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సింగ్‌నగర్ మహిళల నిరసన
లబ్బీపేట : ఇళ్లులేని పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను.. పార్టీ కార్యకర్తలకు కట్టబెడుతున్నారు. నిరుపేదలను మాత్రం పట్టించుకోవడం లేదు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలోను అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. కాల్వగట్లుపై,రోడ్డు పక్కన ఉన్న వారికి కేటాయిస్తున్నామంటున్నారు. మా పరిస్థితి ఏమిటని సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన సుమారు 150 మంది మహిళలు మంగళవారం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఇళ్లు విషయమై ఎమ్మెల్యే అడిగేందుకు లోనికి వెళ్లగా, కొత్తగా నిర్మిస్తున్న భవనాలను పూర్తయిన తర్వాత ఇస్తామని చెప్పడంతో, అవి ఎప్పుడు పూర్తవుతాయి. మాకు ఎప్పుడు ఇస్తారంటూ పలువురు మహిళలు కార్యాలయం బయట ఆందోళనకు దిగారు. నాలుగేళ్ల కిందట సర్వే నిర్వహించి ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పి స్లిప్పులు ఇచ్చారని, కానీ ఇప్పుడు పట్టించుకునే వారే లేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దెలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం నిర్మించిన ఎన్‌యూఆర్‌ఎం గృహాలను ప్రజాప్రతినిధులు వారి అనుయాయులకు ఇస్తుంటే తమపరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.
ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు వున్నాయని, వాటిని తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కాల్వగట్టులపై ఆక్రమణదారులకు ఇస్తామంటున్నారు కానీ, ఇళ్లులేని మాకు ఇవ్వనంటున్నారని, అంటే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తేనే ఇళ్లు ఇస్తారా అని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు
కొన్ని ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాత ఇస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారు. అవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకూఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు వస్తాయని ఆశ పడ్డాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాల్వగట్లు ఆక్రమించిన వారికి ఇస్తామంటే మరి మాపరిస్థితి ఏమిటి?
- కోమల జ్యోతి
అద్దెలు కట్టలేక పోతున్నాం
ఎన్నో ఏళ్లుగా సొంత ఇళ్లులేకుండా అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నాం. ఇప్పుడు అద్దెలు పెంచేశారు. రెండు, మూడునెలలు అడ్వాన్సులు అడుగున్నారు. ఎన్‌యూఆర్‌ఎం పథకంలో మాకు ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో నిర్మాణాలు పూర్తవ్వాలంటున్నారు.దశాబ్దాలుగా ఇళ్లులేని మాపరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.
- షేక్ మజాన్‌బీ
వైఎస్ కడితే..వీళ్లు అజమాయిషీ చేస్తున్నారు
నిరుపేదల సొంత ఇంటి కల నేరవేర్చాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి నగరంలో ఎన్‌యూఆర్‌ఎం పథకం ద్వారా వేలాది గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అవి పూర్తయిన తర్వాత ఇప్పుడ మరోపార్టీ నాయకులు వారి అనుయాయులకు కట్టబెడుతున్నారు. నిజమైన నిరుపేదకు ఇళ్లు దక్కడం లేదు.
- నెమ్మాది కుమారి