ఎం.ఎల్.ఎ. మైనింగ్.. ల్యాండ్స్.. అధికారం.. | MLAs Mining lands .. .. authority .. | Sakshi
Sakshi News home page

ఎం.ఎల్.ఎ. మైనింగ్.. ల్యాండ్స్.. అధికారం..

Published Tue, Jul 12 2016 2:22 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

MLAs   Mining lands .. .. authority ..

అరకులోయ ఎమ్మెల్యే సరికొత్త భాష్యం
{పజాప్రతినిధి ముసుగులో దందాలే.. దందాలు..
 ఓ పక్క డీ ఫారం భూముల కబ్జా
మరో వైపు యథేచ్ఛగా  అక్రమ మైనింగ్
ఇంకోవైపు సర్కారు నిధులతో క్యాంపు కార్యాలయాలు
మన్యంలో అడ్డూఅదుపూ లేని కిడారి అరాచకాలు

 
ప్రజాతీర్పును పక్కన పెట్టి పార్టీ ఫిరాయించడం ద్వారా ప్రజలకు నమ్మకద్రోహం చేశారు.. పేదలను మాటలతో మభ్యపెట్టి జీవనాధారమైన వారి భూములను లాక్కున్నారు..  ఇవి చాలవన్నట్లు అక్రమ మైనింగ్‌తో ప్రకృతి సంపదను.. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు.. గిరిజన ప్రజాప్రతినిధి ముసుగులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్రమాలను తవ్వినకొద్దీ విస్మయకర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి..  ఈ దందాల కోసమే ఆయన పార్టీ ఫిరాయించి.. అధికార పార్టీలోకి జంప్ చేశారన్న వాదనలను తాజా విషయాలు బలపరుస్తున్నాయి. ఏజెన్సీలో ఇక తనను అడిగేవారు గానీ.. అడ్డుచెప్పేవారు గానీ లేరన్న ధీమాతో అంతులేని అక్రమాలకు పాల్పడుతూ.. ఎమ్మెల్యే అన్న పదానికే కొత్త భాష్యం చెబుతున్నారు. అదేదో సినిమాలో ఎమ్మెల్యే అంటే నువ్వనుకున్నది కాదే.. అంటూ హీరో హీరోయిన్‌ను ఉద్దేశించి పాడిన పాట తరహాలోనే.. ఎం.ఎల్.ఎ. పదంలోని ఎం.. అంటే మైనింగ్, ఎల్.. అంటే ల్యాండ్, ఏ.. అధికార దాహం.. అనే సరికొత్త నిర్వచనం ఇస్తూ చెలరేగిపోతున్నారు.
 

విశాఖపట్నం: ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి ఇటీవల పార్టీకి  ద్రోహం చేసి అధికార టీడీపీలోకి ఫిరాయించారు. అధికార పార్టీ ఆశ చూపిన ఆఫర్లే కారణమన్న వాదనలు అప్పట్లో వెల్లువెత్తాయి. అరకు నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండలంలో తాజాగా వెలుగు చూస్తున్న అక్రమ మైనింగ్, భూదందాల పర్వం వాటిని నిజం చేస్తున్నాయి. అనంతగిరి మండలం గరుగుబిల్లి పంచాయతీ పరిధిలో సుమారు 136 ఎకరాల ఢీ ఫారం భూములను పేద రైతులను మాయచేసి కాజేసిన ఎమ్మెల్యే కిడారి.. వాలాసి పంచాయతీలో కాల్సైట్ మైనింగ్ నిర్వహిస్తున్న విషయం బయటపడింది. శివలింగపురం గ్రామానికి చెందిన భీమవరపు ముత్యాలు పేరిట వాలాసి పంచాయతీ తూబుర్తి గ్రామంలో సుమారు పదెకరాల కాల్సైట్ మైనింగ్ లీజు ఉంది. మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు శెట్టి గంగాధరస్వామి మేనల్లుడైన ముత్యాలు పేరిట ఈ లెసైన్స్ ఉన్నప్పటికీ అక్కడ గత ఐదేళ్లుగా మైనింగ్ నిర్వహించడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ముత్యాలు మైనింగ్ నిలిపివేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కిడారి దానిపై కన్నేశారు. మైనింగ్ చేపట్టేందుకు ప్రయత్నించినా లీజుదారు అందుకు అంగీకరించలేదు.


ఇటీవలే  అధికార పార్టీలో చేరి మళ్లీ మైనింగ్‌పై పడ్డారు. చక్రం తిప్పి లీజుదారునితో ఒప్పందం కుదుర్చుకొని తవ్వకాలు ప్రారంభించారు. గత నెలరోజులుగా ఇక్కడ విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 24 టన్నుల మేరకు కాల్సైట్ ఖనిజం తరలించినట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో కాల్సైట్ మైనింగ్ నిర్వహిస్తున్న దుర్గా సొసైటీకి బినామీగా ఖమ్మం జిల్లాకు చెందిన అప్పారావు అనే వ్యాపారి వ్యవహరిస్తున్నారు.

సదరు అప్పారావుతో కలిసి కిడారి పదెకరాల్లో మైనింగ్ చేపట్టినట్టు తెలుస్తోంది. పనిలోపనిగా నిమ్మలపాడులోని మూడు బ్లాకుల్లో ఉన్న సుమారు 50 ఎకరాల కాల్సైట్ గనులను కూడా నెలరోజుల క్రితంలీజుదారులపై ఒత్తిడి తెచ్చి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక అనంతగిరి మండలంలో ఎక్కడైనా మైనింగ్ భూములు కేటాయించాలని కోరుతూ విశాఖలోని మైనింగ్ శాఖ అధికారులపై కిడారి ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం.

అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పట!
హుకుంపేట మండలం జోగులపుట్టు, గూడ గ్రామాల సరిహద్దులోని నల్లరాయి(బ్లాక్ స్టోన్) క్వారీలో మైనింగ్‌పై మూడేళ్ల కిందట విమర్శలు వెల్లువెత్తాయి. కిడారి పేరిట లెసైన్స్ ఉన్న ఆ క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతోందంటూ అప్పటి మంత్రి బాలరాజు హయాంలో రూ.60 లక్షల జరిమానా కూడా విధించారు. అప్పటి నుంచి తెరచుకోని ఆ క్వారీ సరిగ్గా కిడారి టీడీపీలోకి జంప్ చేయడానికి కొద్దిరోజుల ముందే మళ్లీ తెరచుకుంది. కిడారి ఒత్తిడి మేరకు అప్పటి జరిమానా విషయాన్ని కూడా గాలికొదిలేసి అధికారులు మైనింగ్‌కు అనుమతులిచ్చేశారు. దాంతో అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగించేస్తున్నారు.

 ప్రభుత్వ నిధులతో క్యాంపు కార్యాలయాలకు సోకులు : అరకులోయలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం  ఐటీడీఏ నిధులతో నిర్మించిన రెంటల్ హౌసింగ్ కాలనీలోని ఒక భవనంలో కిడారి పాగా వేశారు. సుమారు రూ.పది లక్షల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి మరమ్మతులు చేపట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దారు. ఆయన వ్యక్తిగత కార్యాలయానికి ప్రభుత్వ నిధులతో సోకులు చేయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తగా, ఇప్పుడు పాడేరులో కూడా ఇదే మాదిరి రెంటల్ హౌసింగ్ కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తీర్దిదిద్దారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement