
మోడి ప్రభుత్వం అవినీతికి ఆజ్యం పోస్తోంది
తులసిరెడ్డి
వేంపల్లె : టీడీపీ ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడంలేదని, నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతికి ఆజ్యం పోస్తోందని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని.. పొలాలు పదున్లు కూడా అయ్యాయని.. ప్రధానంగా రైతులకు విత్తనాలు, ఎరువులకు పెట్టుబడులు అవసరమన్నారు. పైసాలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రస్తుతం సబ్సిడీ వేరుసెనగ విత్తన కాయలు ప్రభుత్వం అరకొరగా అందిస్తోందన్నారు. 2014 ఖరీఫ్‌కు సంబంధించి ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద రాష్ట్రంలో రూ.1200కోట్లు, జిల్లాకు రూ.45కోట్లు రావాల్సి ఉందన్నారు. వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏమిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మండలాధ్యక్షుడు మురళీమోహన్‌రెడ్డి, ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.