'తెలుగు దద్దమ్మల పార్టీగా పేరు మార్చుకోండి'
హైదరాబాద్: తెలుగు దద్దమ్మల పార్టీగా పేరు మార్చుకోమని టీడీపీకి కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి సలహా ఇచ్చారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు' అని ఆయన అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలకంటే టీడీపీ మీదనే ఎక్కువ ఉందని చెప్పారు. ఈ ప్రైవేట్ బిల్లు ఏపీ భవిష్యత్తుకు సంబంధించిందని పేర్కొన్నారు. టీడీపీ ఏపీలో అధికార పార్టీగా ఉండి, కేంద్రంలో భాగస్వామ్యగా పార్టీగా ఉందని అన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలను ఒప్పించి ప్రైవేట్ బిల్లును ఆమోదింపచేయాల్సిన బాధ్యత టీడీపీకి ఉందని స్పష్టం చేశారు.
టీడీపీకి చేతకాకపోతే కేంద్రమంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు తప్పుకోవాలి. అలాగే రాష్ట్ర మంత్రివర్గం నుంచి బీజేపీని తప్పించాలని అన్నారు. లేకుంటే తెలుగుదేశం పార్టీ పేరు మార్చుకోవాలి.. తెలుగు దద్దమ్మల పార్టీ, లేదా తెలుగు ద్రోహుల పార్టీ'' అని పేరు మార్చుకోవాలని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం పనితీరు పట్ల 87.14 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టు తన సర్వేలో వెల్లడైనట్టు చంద్రబాబు చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు.. చంద్రబాబు సర్వేలో నిజం ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన సర్వే నిజమని నమ్మితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడాలని కాంగ్రెస్ సవాల్ చేస్తోందని తులసిరెడ్డి తెలిపారు.