పోలీస్ స్టేషన్‌లో దీనంగా కూర్చున్న వృద్ధ దంపతులు
సాక్షి, పేరేచర్ల (గుంటూరు): భార్యకు క్యాన్సర్ సోకడంతో ఆమెను చికిత్స కోసం తీసుకెళ్తున్న వృద్ధుడికి చేదు అనుభవం ఎదురైంది. భాగస్వామి ఆరోగ్యం నయం చేసేందుకు అప్పులు చేసి తెచ్చుకొన్న నగదు మాయమైంది. ఈ ఘటనతో బోరున విలపిస్తూ వృద్ధ దంపతులు మంగళవారం మేడికొండూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. నూజెండ్ల మండలం జెడ్డావారి పాలెం గ్రామానికి చెందిన గొట్టిపాటి వెంకటేశ్వర్లు, కోటమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నాళ్ల నుంచి పెదకంచర్లలోని కూతరు ఇంట్లో నివాసం ఉంటున్నారు.
భార్య కోటమ్మకు క్యాన్సర్ సోకటంతో రోజు గుంటూరు వెళ్లి వైద్యం చేయించు కోవాలంటే వారికి వయస్సు సహకరించని పరిస్థితి. ఈ క్రమంలో నెల కిందట పేరేచర్లలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి రోజు వెంకటేశ్వర్లు తన భార్యను గుంటూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లి.. తీసుకొస్తున్నాడు. సోమవారం కూడా యథావిధిగా ఆస్పత్రికి వెళ్లి గుంటూరు నుంచి పేరేచర్లకు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో వారు ఆర్టీసీ బస్సు దిగటంతో అక్కడే ఉన్న ఆటో వాలా గ్రామంలోకి వెళుతున్నాను.. వస్తారా అని ఎక్కించుకొన్నాడు. కోటమ్మను వెనుక సీటులో కూర్చోమని చెప్పి వెంకటేశ్వర్లను ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నాడు.
అప్పటికే ఆటోలో మరో వ్యక్తి ఉన్నాడు. ఆటోను గ్రామంలోకి పోనివ్వకుండా బైపాస్ రోడ్డులోకి తిప్పాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వెంకటేశ్వర్లు ఇటెందుకు వెళ్తున్నావని ప్రశ్నించగా తిరిగి బైపాస్‌లోనే వదిలేసి వెళ్లాడు. వృద్ధ దంపతులు నడుచుకొంటూ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. అయితే వెంకటేశ్వర్లు టిఫిన్ తెచ్చుకునే క్రమంలో జేబులో డబ్బులు చూసుకోగా రూ.70 వేలు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఆటోడ్రైవర్ డబ్బులు కూడా తీసుకోలేదని, కావాలనే వేరే వ్యక్తిని ఆటోలో కూర్చోబెట్టి చేతులు పలు మార్లు మార్చి మార్చి పట్టుకోమని చెప్పాడని, ఇదంతా అతని పనేనంటూ వెంకటేశ్వర్లు ఆవేదన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment