కమల ‘విశాఖ’!
- బీజేపీకి ఆనందల‘హరి’
- విష్ణుకే ‘వన్’దనం
- పదిహేనేళ్ల తర్వాత విజయం
- రెండుసార్లు సైకిల్ మద్దతుతోనే
విశాఖపట్నం, న్యూస్‌లైన్: పదిహేనేళ్ల క్రితం ఎమ్మెల్యేగా... ఇప్పుడు ఎంపీగా ఘన విజ యం. ఆ ఘనతను డాక్టర్ కంభంపాటి హరి బాబు సాధించారు. విశాఖలో 15 ఏళ్ల తర్వాత బీజేపీ వికాసానికి కారకులయ్యారు. రెండుసా ర్లూ తెలుగుదేశం పార్టీతో పొత్తువల్లే విజయకేతనం ఎగరేయగలిగారు.
హరి వెర్సెస్ హరిబాబు
విశాఖ ఒకటో నియోజకవర్గం నుంచి 1999 లో ఎమ్మెల్యేగా డాక్టర్ కంభంపాటి హరి బాబు విజయం సాధించగా మళ్లీ 2014లో ఆయన విశాఖ నుంచి ఎంపీగా విజేతల య్యారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకున్న హరిబాబు 1999లో అప్పటి మేయర్‌గా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సబ్బం హరిపై హరి బాబు విజయం సాధించారు.
విశాఖ రాజకీయాలకు అంతగా పరిచయం లేని వ్యక్తిగానే హరిబాబు అప్పట్లో రాజకీ య అరంగేట్రం చేశారు. మొదటి పోటీలో నే మేయర్‌పై 6 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించడంతో హ రిబాబు పేరు బీజేపీలో మారుమోగింది. బీజేపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించడంతో బీజేపీ జాతీయ నేతల దృష్టిలో పడ్డారు. ఆ తర్వా త జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు సత్యనారాయణపై ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో బరిలోకి దిగలేదు. జాతీయ పార్టీ సేవలో గడిపారు.
సీమాంధ్ర అధ్యక్షునిగా పగ్గాలు
ఇటీవల రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాం ధ్రకు జరుగుతున్న నష్టంపై బీజేపీ అధిష్టానాన్ని కదిలించారు. సీమాంధ్ర ప్రయోజనాలు పరిరక్షించే దిశగా బీజేపీ నేతలను పురిగొలిపారు. రాష్ట్రం విడిపోయిన స్వల్ప కాలంలోనే బీజేపీ సీమాంధ్ర అధ్యక్షునిగా హరిబాబు పగ్గాలు చేపట్టారు. విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
తిరిగిన ‘విష్ణు’చక్రం
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెన్మత్స విష్ణుకుమా ర్ రాజు గెలుపు కూడా బీజేపీ ఖాతాలో జమ అయింది. హరిబాబు తర్వాత విశాఖ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు రికార్డులకెక్కారు.
విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెన్మెత్స విష్ణుకుమార్ రాజు ఎన్నికలకు సరిగ్గా మూడు మాసాల కిందటే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రుషికొండ కేంద్రంగా సాఫ్ట్‌వేర్ పరిశ్రమను నడిపే విష్ణుకుమార్ రాజుకు కూడా రాజకీయానుభవం లేదు.
ఇటీవల జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉద్యోగులను ముం దుండి నడిపించేవారు. ఆ అనుభవంతోనే నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకోవడం, ఆ తర్వాత పార్టీలోని సీనియర్లందరినీ కాదని బీజేపీ-టీడీపీ పొత్తులో ఉత్తర టికెట్ పొందడంలో విజయం సాధించారు.