షర్మిల 'సమైక్య శంఖారావం' మరింత స్ఫూర్తి | More inspiration from sharmila 'samaikya sankharavam' | Sakshi
Sakshi News home page

షర్మిల 'సమైక్య శంఖారావం' మరింత స్ఫూర్తి

Published Sun, Sep 15 2013 2:08 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

More inspiration from sharmila 'samaikya sankharavam'

సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో 45 రోజులుగా ఉవ్వెత్తున సాగుతున్న సమైక్య ఉద్యమానికి వైఎస్సార్ సీపీ పూరించిన సమైక్య శంఖారావం యాత్ర మరింత స్ఫూర్తిని ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ఈ యాత్రకు జిల్లాలో సమైక్యవాదులు, పార్టీశ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీల రెండు నాల్కల విధానాన్ని తన యాత్రలో షర్మిల ఎండగట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం నుంచి జిల్లాలో అడుగిడిన షర్మిల శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తుని వద్ద తాండవ వంతెన మీదుగా విశాఖ జిల్లా పాయకరావు పేటలో ప్రవేశించారు. జిల్లాలో కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్, కాకినాడ  సిటీ, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల మీదుగా సాగిన షర్మిల యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలుపట్టారు. 
 
యాత్ర కేంద్ర పాలిత ప్రాం తమైన యానాంతో పాటు కాకినాడ నగరం సహా మూడు మున్సిపాలిటీలు, 14 మండలాల్లో 180 కిలో మీటర్ల మేర సాగింది. యానాం ముఖద్వారంలో మహానేత వైఎస్ నిలువెత్తు విగ్రహానికి షర్మిల పూలు వేసి నివాళులర్పించారు.  కోనసీమ ముఖద్వారం రావులపాలెం, అమలాపురం,  కాకినాడలలో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలకు  జనం పోటెత్తారు. ఒక వైపు సమైక్యవాదులు, మరోపక్క వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో షర్మిల యాత్ర నూతనోత్తేజాన్ని నింపింది. సమన్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రధాన డిమాండ్‌తో ప్రజల ముందుకు వచ్చినషర్మిలకు ప్రజలతో పాటు వివిధ జేఏసీలు, సంఘాలు సంఘీభావం తెలుపుతూ వెన్నంటి నిలిచాయి.  రాష్ట్ర విభజన పై కాంగ్రెస్, టీడీపీ నేతల తీరును పదునైన వాగ్బాణాలతో ఎండగడుతూ, వైఎస్సార్ సీపీ ఒక్కటే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని స్పష్టం చేయడం ఉద్యమకారులను ఉత్సాహ పరిచింది. యాత్ర సాగినంత మేరా పల్లెలకు పల్లెలు కదలివచ్చి సమైక్య నినాదాలతో హోరెత్తించాయి. 
 
కాకినాడ నగరం....జనసాగరం
తొలిరోజు రావులపాలెం, అమలాపురంలలో జరిగిన సమైక్య సభలు ఒక ఎత్తయితే శనివారం కాకినాడలో మహాధర్నా, అనంతరం జరిగిన సభ మరొక ఎత్తుగా సాగాయి. కనివినీ ఎరుగని రీతిలో కాకినాడ నగరం షర్మిల రాకతో జనసాగరాన్ని తలపించింది. నగరంలో అడుగుపెట్టింది మొదలు ఐదువేల బైక్‌లతో వేలాది మంది పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు ఆమె వెంట కదం తొక్కారు. వెయ్యిమందికి పైగా దండోరా కార్యకర్తలు ముఖాలకు జగన్ మాస్క్‌లు వేసుకుని డాన్సులు చేస్తూ.. డప్పులు వాయిస్తూ  సమైక్య నినాదాలతో హోరెత్తించారు. పార్టీలకతీతంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికసంఘాలు   షర్మిల శంఖారావయాత్రలో పాల్గొని రాష్ర్ట సమైక్యత కోసం అలుపెరగకుండా పాటు పడుతున్న వైఎస్సార్ సీపీకి తామంతా అండగా ఉంటామని చాటారు. 
 
కాకినాడ మసీదు సెంటర్‌లో జరిగిన మహాధర్నాకు, షర్మిల సభకు సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది పోటెత్తారు. సూపర్‌బజార్ నుంచి జగన్నాథపురం వంతెన వరకు మెయిన్‌రోడ్డు జనసంద్రంగా మారింది. మెయిన్‌రోడ్డుకు దారితీసే గంజాంవారి వీధి, జ్యోతుల మార్కెట్ రోడ్డు, ఆర్‌ఆర్ రోడ్డులతో పాటు సినిమా రోడ్డు, దేవాలయం వీధి జనంతో కిక్కిరిశాయి. మండుటెండ ను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన  జనం షర్మిల సభ పూర్తయ్యే వరకు రోడ్లపైనే నిల్చొని ఆసక్తిగా ఆమె ప్రసంగాన్ని విన్నారు.  జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో షర్మిల శంఖారావయాత్రకు స్వచ్ఛందంగా పెద్దసంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు పాల్గొన్నారు. జిల్లా జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథ్, నగర నాయకులు అనిల్ జాన్సన్ సభావేదికపైకి ఎక్కి షర్మిలకు సంఘీభావం తెలిపారు. 
 
ఉద్యమకారులకు భరోసా
సర్కార్ జీతాలు ఇవ్వకపోయినా 45 రోజులుగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు షర్మిల కాకినాడ సభలో భరోసాను ఇచ్చారు. ‘ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం వచ్చిన అనంతరం ఉద్యమ సమయంలో మీరు కోల్పోయిన జీతాలతో పాటు ఒక నెల బోనస్ కూడా ఇస్తా’మని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో సమరోత్సావాన్ని నింపారు.రాష్ర్ట విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం చిలక పలుకులు పలుకుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, విభజన సంకేతాలు తెలిసినా నోరు మెదపని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేసుకోవాలన్న ఏకైక అజెండాతో రాష్ర్ట ప్రజల మధ్య చిచ్చు పెట్టిన సోనియగాంధీల తీరును ఎండగట్టినప్పుడు ప్రజల హర్షధ్వానాలు మిన్నంటాయి.
 
చేబ్రోలులో మహానేత విగ్రహావిష్కరణ
కాకినాడ రూరల్ నియోజకవర్గం మీదుగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు చేరుకున్న షర్మిల మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటైనమహానేత వైఎస్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహానేత విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులతో మాత్రమే ఆవిష్కరింప చేయాలన్న  దొరబాబు అభీష్టం ప్రకారం విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంలో వందలాది మంది ‘జోహార్ వైఎస్సార్, జై జగన్, జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి షర్మిల ప్రత్తిపాడు నియోజక వర్గ పరిధిలోని కత్తిపూడి మీదుగా తుని చేరుకున్నారు. తుని వద్ద పార్టీ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా డప్పు కళాకారులతో షర్మిలకు స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం ఆరు గంటల సమయంలో తాండవ వంతెన మీదుగా పాయకరావుపేట వద్ద  విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన షర్మిలకు పార్టీ జిల్లా నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాలో రెండురోజుల పాటు సాగిన షర్మిల శంఖారావయాత్ర ఇటు పార్టీ శ్రేణుల్లోనూ, అటు సమైక్యవాదుల్లో సమరోత్సాహాన్ని ఇనుమడింపజేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement