సమైక్య శంఖారావం.. సమర సింహనాదం
సమైక్య సమర సేనా వాహినులకు ఆమె శంఖారావం చైతన్య ప్రేరకమైంది. స్ఫూర్తిదాయకమైంది. సమరావేశంతో ఉరకలేస్తున్న జన శ్రేణులకు ఆమె సందేశం ఉత్సాహ కారణమైంది. ఉత్తేజ పవనమైంది. జలపాతం జోరుతో.. ప్రభంజనం హోరుతో వెల్లువెత్తిన ఆమె ఆవేశపూరిత ప్రసంగం సమైక్యాంధ్ర వంచకుల కుటిల నీతిపై నిశిత కరవాలమై నిప్పులు కురిపించింది. నిర్విరామంగా పురోగమిస్తున్న ప్రజోద్యమ ప్రస్థానాన్ని ప్రస్తుతించే రీతిన సాగిన ఆమె వాక్ప్రవాహం కేంద్రం దమననీతిని తెగనాడుతూ సాగింది. సమైక్య శంఖారావం పేరిట వైఎస్ తనయ, జగన్ సోదరి షర్మిల నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం పాయకరావుపేటలో ఆమె ఉపన్యాసం ఉద్యమాన్ని ఉద్దీపించే విధంగా ఉప్పొంగిపోయింది.
సాక్షి, విశాఖపట్నం : ప్రజాచైతన్యం పరవళ్లు తొక్కింది. ఉద్యమాలతో ఉప్పొంగుతున్న జనవాహిని సమైక్య శంఖారావ తరంగాల దిశగా ఉరకలేసింది. పా యకరావుపేట జనసంద్రమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మి ల తలపెట్టిన సమైక్య శంఖారావ యాత్రతో విశాఖ జిల్లా ఉత్తేజితమైంది. ఉత్తుంగ తరంగమైంది. రాష్ట్ర విభజనకు నిరసనగా 46 రోజు లుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఉద్యమానికి షర్మిల శంఖారావం మరింత ఉత్సాహాన్నిచ్చింది. సీమాంధ్రలో సమైక్య శంఖారావం పేరుతో నిర్వహిస్తున్న బస్సుయాత్ర శనివారం సాయంత్రం పాయకరావు పేటకు చేరుకోవడంతో సమరోత్సాహం అవధుల్లేని సాగరమే అయింది. షర్మిల పలుకులతో ప్రజాహృదయ ఘోష అంబరాన్నంటింది. ఆవేశం అర్ణవమైం ది. పేటలో ఏ దారయినా, ఏ కూడలైనా జన జీవనదిలా కనిపించింది.
ఆమె మాట కోసం..
పాయకరావుపేట.. శనివారం.. సాయంత్రం.. షర్మిల ప్రయాణిస్తున్న బస్సు కోసం ప్రజానీకం ఒళ్లంతా కళ్లుగా నిరీక్షిస్తున్న సమయమది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం అల్లంత దూరాన కనిపించగానే జనం ప్రభంజనంలా ఉప్పొంగిపోయింది. బస్సు ఆగి, షర్మిల పెకైక్కి ప్రసంగించడానికి సిద్ధం కాగానే జనమంతా జైసమైక్యాంధ్ర అంటూ సమర నినాదాలతో స్వాగతం పలికింది. ప్రతిగా అభివాదం చేసిన షర్మిల నోట వెంట వెలువడ్డ ప్రతి మాటకూ ప్రజావాహిని కేరింతలతో సమ్మతి తెలిపింది. ‘వైఎస్సార్‌పార్టీ ఎప్పటికీ సమైక్యనినాదంతోనే ముందుకు వెళ్తుంది.
రాష్ట్రవిభజన ప్రక్రియను నిలిపివేసి ప్రజలకు మేలు కలిగేవరకు ఎందాకైనా పోరాడుతుంది.’ అని ఆమె ప్రకటించగానే హర్షం వ్యక్తమైంది. ‘అసలు వైఎస్ బతికే ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు.తెలుగు ప్రజల ఓట్ల బిక్షతో కేంద్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ తెలుగు జాతిని ముక్కలు చేయడం ఏ నీతి కిందకు వస్తుంది? ప్రజల ఓట్లతో పదవులు దక్కించుకుని ఇప్పుడు రాష్ట్రవిభజనతో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాజీనామా చేయకుండా కాంగ్రెస్, టీడీపీ నేతలు పదవులు పట్టుకు వేలాడుతూ ఉండడం ఏం న్యాయం?’ అని చెప్పినప్పుడు సభికుల్లో విశేష స్పందన వచ్చింది.
రాష్ట్రవిభజనకు చంద్రబాబు ఇచ్చిన లేఖ కారణమని,అందుకనే ఆయన వస్తే తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చినప్పుడు ప్రజాగళ ఘోష మిన్నంటింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదం సమైక్యవాదమని వేలాది మంది ప్రజల సాక్షిగా ఆమె చేసిన ప్రకటన పోరాటానికి మరింత ప్రేరణనిచ్చింది. 22 నిమిషాలపాటు సాగిన ప్రసంగాన్ని ముగిస్తూ జై సమైక్యాంధ్ర,జైజై సమైక్యాంధ్ర అని నినదించినప్పుడు ప్రజానీకం గొంతు కలిపింది.
సమైక్య శిబిరాలనుంచి జనం వెల్లువ
రాష్ట్రవిభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, వివిధ సంఘాలు ఉద్యమాల నిర్వహణలో తలమునకలుగా ఉన్నాయని. నిరాహా ర దీక్షలు, నిరవధిక నిరశనలు ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. ఇలా ఆందోళన చేస్తున్న వా రంతా శనివారం సాయంత్రం రాజన్న బిడ్డ మాట వినడానికి తరలివచ్చారు. సమైక్యాంధ్ర కు మద్దతుగా చేపట్టిన యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఎందరో యువకులు ముక్కలైన రాష్ట్ర చిత్రపటాలను ప్రదర్శించారు. గతంలో ప్రజాప్రస్థాన యాత్రలో షెడ్యూల్ లేకపోవడంతో పాయకరావుపేట రాలేక పోయిన షర్మిల ఈసారి బస్సు యాత్రలో ఇక్కడికి రావడంతో జనం పులకించిపోయారు.
నేడు విశాఖలో సభ
తూర్పుగోదావరిలో యాత్ర ముగించుకుని జి ల్లా సరిహద్దులోని పాయకరావుపేట-తాండవ బ్రిడ్జి వద్దకు సరిగ్గా 6.01 గంటలకు షర్మిల చేరుకున్నారు. పాయకరావుపేటలో ప్రసంగం ముగియగానే షర్మిల నక్కపల్లికి చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం ఇక్కడినుంచి బయలుదేరి విశాఖనగరంలోని నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
పాయకరావుపేటలో జరిగిన బహిరంగసభకు జిల్లా నుంచి వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, జిల్లా పార్టీ ఇన్‌చార్జి ముదునూరి ప్రసాదరాజు, పొలిట్‌బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ నేత గొల్ల బాబూరావు,జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, నియోజకవర్గాల సమన్వయకర్తలు చెంగల వెంకట్రావు, బలిరెడ్డి సత్యారావు, పూడి మంగపతిరావు, బూడి ముత్యాలనాయుడు, పెట్ల ఉమా శంకర గణేశ్, గండి బాబ్జీ, బొడ్డేడ ప్రసాద్, కోరాడ రాజబా బు, తిప్పల నాగిరెడ్డి, వంజంగి కాంతమ్మ, గిడ్డి ఈశ్వరి, సత్యవాణి, తుని సమన్వయకర్త దాడిశెట్టి రాజా, పార్టీ నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. జిల్లా యూత్ కన్వీనర్ అదిప్‌రాజు, జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి పాల్గొన్నారు.