ప్రేమ వివాహం చేసుకుని తొలిసారి గర్భం దాల్చిన ఆమె ఎన్నో కలలు కంది. నెలలు నిండే కొద్దీ ఆమె మధురోహల్లో తేలిపోయింది.అనుకున్నట్లే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే విధి చిన్నచూపు చూసింది. బిడ్డకు పాలు పట్టిన కొన్ని క్షణాలకే కన్నుమూసింది.
పెరిందేశంలో విషాదం
కేవీబీపురం: మండలంలోని పెరిందేశం గ్రామానికి చెందిన సుమిత్ర (19), గోపాల్ (22) గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమిత్ర గర్భం దాల్చడంతో గోపా ల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నెలలు నిండి గురువారం తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి శిశువును వెలికితీశారు. బలహీనంగా ఉన్నప్పటికీ సుమిత్ర బిడ్డను చూడగానే మోములో ఆనందం తొంగిచూసింది. మాతృత్వపు మధురిమల నడుమ బిడ్డకు తొలిసారి పాలు పట్టించింది.
అయితే బలహీనంగా ఉండటమో, రక్తహీనత కారణమోగానీ ఆ తల్లి కొన్ని క్షణాలకే కన్నుమూసింది. కలలో కూడా ఊహించని ఈ హఠాత్ పరిమాణానికి గోపాల్‌కు ఒక్కసారిగా మిన్ను విరిగి మీద పడినట్లైంది. ఓ వైపు పురిటి బిడ్డ..మరో వైపు విగతజీవిగా సుమిత్రను చూసి గోపాల్ గుండె సంద్రమైంది. పొగిలి..పొగిలి ఏడుస్తున్న అతడిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చూపరులను సైతం కంటతడి పెట్టించింది. అంబులెన్సులో స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. మరోవైపు ఆకలితో పురిటిబిడ్డ ఏడుపు అందుకుంది. గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమైంది. తల్లి పాల కోసం పురిటి బిడ్డ ఏడుపు, గోపాల్ రోదన నడుమ శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు ఆ పసికందుకు నానమ్మే అమ్మ అయ్యింది. పోతపాలు పట్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment