శేషాద్రితో దీపాకుమారి పెళ్లి ఫొటో (ఫైల్), అత్తారింటి ముందు తన బిడ్డతో ఆందోళన చేస్తున్న దీపాకుమారి
మదనపల్లె : ప్రేమించి పెళ్లి చేసుకుని తండ్రి కూడా అయ్యాడు. అయితే అతని తల్లిదండ్రులు దళితురాలనే నెపంతో కోడల్ని ఇంట అడుగు పెట్టనీయలేదు. దీంతో అతడు ఆమెను వదిలించుకునేందుకు వేధింపులకు పూనుకున్నాడు. గుట్టుగా రెండో పెళ్లి ప్రయత్నాల్లో పడ్డాడు. ఇది తెలుసుకున్న అతడి భార్య బిడ్డతో సహా వచ్చి తనకు అన్యాయం చేయవద్దని అత్తమామల్ని, భర్తను ప్రాధేయపడింది. అయితే వారు ఆమెను తూలనాడుతూ గెంటేయడంతో న్యాయం కోసం ఆమె రోడ్డెక్కింది. తన బిడ్డతో సహా అత్తగారింటి ముందు ఆందోళన చేసింది. శుక్రవారం ఈ సంఘటన మండలంలోని రెడ్డిగారిపల్లెలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం..కొత్తిండ్లు రంగారెడ్డి కాలనీకి చెందిన దీపాకుమారి స్థానికంగా ఒక నర్సింగ్ హోమ్‌లో డయాలసిస్ టెక్నీషియన్‌గా పనిచేసేది. రెడ్డిగానిపల్లెకు చెందిన శేషాద్రి బాబాయి ఆస్పత్రిలో పనిచేస్తుండేవాడు. దీపాకుమారితో అతడి పరిచయం ప్రేమగా మారింది.
వేర్వేరు కులాలకు చెందిన వారు పెద్దలకు తెలియకుండా తవళం నేలమల్లేశ్వరస్వామి ఆలయంలో 2016 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. బసినికొండలో కాపురం పెట్టారు. మూడు నెలలు సజావుగా వారు కాపురం సాగింది. తర్వాత శేషాద్రి తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఎస్సీ అనే నెపంతో వారు దీపాకుమారిని కోడలిగా అంగీకరించేందుకు నిరాకరించారు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమెను వదిలించుకునేందుకు శేషాద్రి విడాకులివ్వాలని వేధించేవాడు. అప్పటికే గర్భంతో ఉన్న ఆమె తన భర్త వేధింపుల విషయమై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. పోలీసులు శేషాద్రి, కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయిననూ వారి తీరు మారలేదు.
గొడవలు..మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే దీపాకుమారి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వ్యవధిలో కేరళలో ట్రైనింగ్ పేరిట వెళ్లిన భర్త ఎంతకూ రాకపోవడం, తన భర్తకు రెండో పెళ్లి చేసేందుకు అత్తమామలు యత్నిస్తున్నారని, భర్త గ్రామంలోనే ఉంటున్నాడని తెలియడంతో ఏడాదిన్నర వయసున్న బిడ్డతో రెడ్డిగానిపల్లెలోని అత్తగారింటికి వెళ్లింది. అయితే ఆమెను తూలనాడి, బయటకు గెంటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. బిడ్డతో సహా అత్తారింటి ముందు బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళన చేసింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. విచారణ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment