చిత్తూరు, చంద్రగిరి/శ్రీకాళహస్తి: వారిద్దరూ ఫేస్‌బుక్ ప్రేమికులు. ఇద్దరి కులాలూ వేరు. అయితేనేం ఒకరంటే ఒకరికి ప్రాణంగా మారారు. తమ ప్రేమను పెద్దలు వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో ఇద్దరూ రెండు రోజుల క్రితం అదృశ్యమై వివాహం చేసుకున్నారు. అయినా తమను విడదీస్తారనే అనుమానంతో ఇద్దరూ కలిసే చనిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తాము చనిపోవడానికి గల కారణాలను అందులో వివరించారు. అనంతరం సోమవారం అర్ధరాత్రి తర్వాత ఇద్దరూ రైలు కింద పడి మృత్యు ఒడిలోకి జారుకున్నారు. తెల్ల వారిజామున విగత జీవులుగా వారి దేహాలు రైలు పట్టాల వద్ద దర్శనమిచ్చాయి. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున మొరవపల్లె సమీపంలో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు, ప్రేమ జంట బంధువుల కథనం... శ్రీకాళహస్తిలోని పీర్లచావడి వీధిలో నివాసముంటున్న రవిబాబు, సుమతిల కుమార్తె పల్లవి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అలాగే, మండలంలోని మొరవపల్లె దళితవాడకు చెందిన దొరస్వామి, రాజమ్మల కుమారుడు ధనుంజయ(19) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
వీరిద్దరికీ కొంత కాలం క్రితం ఫేస్‌బుక్ ద్వారా కలిగిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు వ్యతిరేకిస్తారని భావించారు. ఈ నేపథ్యంలో 13న ఇంటర్మీడియెట్ ఫలితాలు వెలువడడంతో ఇంటర్‌నెట్ సెంటర్‌లో ఫలితాలను చూసుకువస్తానంటూ పల్లవి ఇంటి నుంచి బయల్దేరింది. అయితే ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె బంధువులు గాలించారు. అనంతరం శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక, అదే రోజున ధనుంజయ తన మిత్రులతో కలసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి వెళ్లాడు. అనంతరం ప్రేమికులిద్దరూ 14న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. కొన్ని గంటల పాటు సంతోషంగా గడిపారు. ఆ తర్వాత ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం మరణాన్ని ఆశ్రయించారు.
సోమవారం అర్ధరాత్రి అనంతరం మొరవపల్లె సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని, రైలు కింద పడి తనువు చాలించారు (సరిగ్గా ధనంజయ ఇంటికి అర కిలోమీటరు దూరంలోనే). ఉదయాన్నే ఇది వెలుగులోకి రావడంతో ధనుంజయ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకుని దిక్కులు పిక్కటిల్లేలా విలపించారు. మమ్మల్ని కాటికి పంపిస్తావనుకుంటే.. మాకన్నా ముందు నువ్వు వెళ్లావా..నాయనా..! అంటూ వారి రోదనలు పలువురినీ కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న పాకాల రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రేమజంట మృతదేహాలను తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యకు గంట ముందు..
‘‘బై అన్నా..బై వదినా..బై మా..బై డాడీ..బై విక్రమ్.. అందరికీ బై.. ఇదే మా లాస్ట్ వీడియా.. బతకాలనుకోవడం లేదు..చచ్చిపోతున్నాం.. పెళ్లికూడా అయిపోయింది.. (అప్పుడు తన మెడలోని పసుపుకొమ్మును పల్లవి చూపించింది) విడిపోలేక చచ్చిపోతున్నాం.. మా చావే అందరికీ ఉదాహరణ. దయచేసి ఎవరు లవ్ చేసుకున్నా.. వాళ్లెలాంటి వారైనా, ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. మిమ్మల్నందరినీ చాలా బాధపెడుతున్నాం.. బై..గుడ్‌బై..’’ ఆత్మహత్యకు పాల్పడటానికి ఒక గంటకు ముందు వారిద్దరూ 45 సెకన్ల నిడివి గల ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇందులో ధనంజయ ఎక్కువసేపు మాట్లాడాడు. నవ్వుతూనే, ఇద్దరూ గుండె నిబ్బరంగా మాట్లాడటం గమనార్హం! అయితే సెల్ఫీ వీడియో చివరలో లిప్తపాటు సమయం పల్లవి కళ్లలో తడి కనిపించింది. బహుశా ఆమె కళ్లల్లో తల్లిదండ్రులు, ఆత్మీయులు, స్నేహితులు కదలాడారేమో!!
Comments
Please login to add a commentAdd a comment