
ఎంత కష్టమొచ్చిందమ్మా..
కుంటలో దూకి తల్లి, కుతురు ఆత్మహత్య
బట్టలు ఉతికేందుకని కుమార్తెను కుంటకు తీసుకెళ్లిన తల్లి
ఆలస్యంగా వెళ్లి చావు ముప్పు తప్పించుకున్న మరో కుమార్తె
ఉలవదిన్నెలో విషాదఛాయలు
కుటుంబానికి ఆధారమైన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మతి స్థిమితం కోల్పోవడంతో ఆమె కుదేలైంది. భర్త, పిల్లల పోషణ కోసం కూలీగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా బతుకు బండి లాగడం కష్టమవుతుండడంతో జీవితంపై విరక్తి చెందింది. కుమార్తె సహా కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదృష్టవశాత్తు మరో కుమార్తె తృటిలో తప్పించుకుంది.
పుంగనూరు: మండలం ఉలవలదిన్నెకు చెందిన శ్రీనివాసులు (40) కూలి పనులతో తన కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయాడు. ఇది అతని కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటివరకు ఇంటికే పరిమితమైన అతడి భార్య జయమ్మ (35)పై కుటుంబపోషణ భారం పడింది. రెక్కలు ముక్కలు చేసుకుంటూ భర్త, తన ఇద్దరు కుమార్తెలు నిఖిత(14), పల్లవిని పోషిస్తోంది. నిఖిత పుంగనూరు మున్సిపల్ హైస్కూల్‌లో 8వ తరగతి, పల్లవి 6వ తరగతి చదువుతోంది. మతిస్థిమితం లేని శ్రీనివాసులు ఇంటిపట్టున ఉండేవాడు కాదు. సాయంత్రమైతే అతను ఎక్కడ ఉన్నాడో పలువురినీ వాకబు చేసి ఇంటికి తీసుకువచ్చే పరిస్థితి నడుమ జయమ్మ అష్టకష్టాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో, గత గురువారం తిరుమలకు కుమార్తెలతో వెళ్లి వెంకన్నను దర్శించుకుని తిరిగి తన పుట్టినిల్లైన శ్రీరామపురానికి వెళ్లింది. మంగళవారం తన మేనమామ రమణను వెంట పెట్టుకుని ఉలవలదిన్నెకు చేరుకుంది.
కుమార్తెలను స్కూలుకు వెళ్లవద్దని, కుంట వద్దకు వెళ్లి బట్టలు ఉతుక్కుందామని చెప్పింది. ఆ తర్వాత నిఖితను వెంటబెట్టుకుని గ్రామసమీపంలోని కుంటకు జయమ్మ వెళ్లింది. కొంత ఆలస్యంగా ఇంటి నుంచి కుంట వద్ద చేరుకున్న పల్లవికి బట్టలు గట్టు మీదే ఉండటం, దూరంగా కుంటలో తల్లి మునిగిపోతుండటం చూసి గట్టిగా కేకలు వేయడంతో కూతవేటు దూరంలోని గ్రామం నుంచి గ్రామస్తులు పరుగున అక్కడికి చేరుకున్నారు. సమాచారమివ్వడంతో ఎస్‌ఐ హరిప్రసాద్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జయమ్మ, నిఖిత కోసం స్వయంగా కుంటలో గాలించినా ఫలితం లభించలేదు. చివరకు అగ్నిమాపకశాఖాధికారి షఫి వుల్లాహుసేన్ ఆధ్వర్యంలో అందరూ గాలించారు. సాయంత్రం తల్లీకుమార్తెల మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి, అక్క బలవనర్మరణంతో పల్లవి అనాథగా మిగిలింది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. తన భార్య, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారని శ్రీనివాసులుకు తెలియకపోవడం, అతని కోసం మళ్లీ వెదుకులాటకు పూనుకోవాల్సి రావడం అసలైన విషాదం!