ప్రాణ మిత్రుడు పోయాడని ప్రాణం తీసుకున్నాడు | Youth Ends Life After Hearing About Friends Death In Jagtial | Sakshi
Sakshi News home page

ప్రాణ మిత్రుడు పోయాడని ప్రాణం తీసుకున్నాడు

Published Mon, Jan 3 2022 1:30 AM | Last Updated on Mon, Jan 3 2022 8:32 AM

Youth Ends Life After Hearing About Friends Death In Jagtial - Sakshi

ఆనంద్‌ (ఫైల్‌) సురేశ్‌ (ఫైల్‌)

కోరుట్ల: థర్టీ ఫస్ట్‌ వేడుకల ఏర్పాట్ల కోసం బైక్‌పై బయటకు వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్నేహితుడు చనిపోయాడన్న బెంగతో మరో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం యాక్సిడెంట్‌ జరిగి యువకుడు మరణించగా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో శనివారం రాత్రి అతని స్నేహితుడు సూసైడ్‌ చేసుకున్నాడు. 

థర్టీ ఫస్ట్‌ వేడుకల కోసం.. 
కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట కాలనీలో పేర్ల ఆనంద్‌ (20), రేవెల్లి సురేశ్‌ (19) చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. అయితే ఆర్నెల్ల క్రితం సురేశ్‌ కుటుంబం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ సమీపంలో పార్నెల్‌ గ్రామానికి వలస వెళ్లింది. అక్కడ తండ్రి చినసాయిలుతో పాటు శ్మశానవాటికలో కాటికాపరిగా సురేశ్‌ పనిచేస్తున్నాడు. శ్మశానవాటికలోని గదిలో ఉంటున్నారు.

ఈ క్రమంలో డిసెంబర్‌ 31 శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆనంద్‌.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై ఇంటి నుంచి వస్తూ గోదాం రోడ్డులో ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆనంద్‌ తల, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

ఆనంద్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొం దుతూ శనివారం సాయం త్రం మృతిచెందాడు. థర్టీ ఫస్ట్‌ వేడుకల కోసం ఏర్పా ట్లు చేసుకుంటున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 

వాట్సాప్‌ స్టేటస్‌లో చూసి: ఆనంద్‌ చనిపోయాడని వాట్సాప్‌ స్టేటస్‌లో చూసిన సురేశ్‌.. వెంటనే అహ్మద్‌నగర్‌ నుంచి కోరుట్లకు వెళ్తానని తండ్రి చిన్నసాయిలుకు చెప్పాడు. రాత్రి పూట రైళ్లు ఉండవని, తెల్లారాక వెళ్లాలని తండ్రి చెప్పడంతో ఆగిపోయాడు.

రాత్రంతా సెల్‌లో ఆనంద్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలు చూసిన సురేశ్‌.. పలుమార్లు కోరుట్లలోని తల్లి గంగవ్వకు ఫోన్‌ చేసి ‘అవ్వా.. ఆనంద్‌ సచ్చిపోయిండా’అని ఏడ్చినట్లు తెలిసింది. స్నేహితుడి మరణంతో కలత చెంది శ్మశానవాటికలోనే  గదికి ఉన్న ఇనుప కడ్డీలకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని ఆదివారం ఉదయం గుర్తించిన తండ్రి అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసినట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement