తల్లిని నరికి చంపిన కొడుకు
ఉండి :మండలంలోని పాములపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి ఒక వ్యక్తి తల్లిని నరికి చంపాడు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా అమరావతి నుంచి ఉండి మండలం పాములపర్రు గ్రామానికి కొన్నేళ్ల క్రితం కాలువ లక్ష్మి(55) కుటుంబం వలసవచ్చింది. భర్త మరణంతో లక్ష్మి తన కుమారులు దేవదాసు, చిన్నరాజులతో ఉపాధి వెదుక్కుంటూ ఇక్కడకు వచ్చింది. ఏమైందో తెలియదుగాని ఆదివారం రాత్రి లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దేవదాసు తలపై నరికి చంపాడు. తల్లిని చంపిన అనంతరం పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడు దేవదాసు పిచ్చి పట్టిన వాడని కొందరు అంటున్నారు. గతంలో గ్రామంలో ఒక వ్యక్తిని గాయపరిస్తే దేవదాసును విశాఖపట్నంలోని పిచ్చాసుపత్రికి తరలించి చికిత్స చేయించారని స్థానికులు చెబుతున్నారు. ఐదేళ్ల నుంచి చికిత్స పొందుతున్నట్టు ఆధారాలు లభించాయని పోలీసులు పేర్కొంటున్నారు. తన అన్న దేవదాసు తల్లిని చంపాడని మృతురాలి చిన్న కుమారుడు కాలువ చిన్నరాజు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపారు.