సోమవారం స్వగ్రామానికి మస్తాన్ బాబు మృతదేహం
ఆండీస్ పర్వతశ్రేణుల్లో కన్నుమూసిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం సోమవారం ఆయన స్వగ్రామం గాంధీ జనసంగం చేరుకోనుంది. అర్జెంటీనా నుంచి ప్రత్యేక విమానంలో మల్లిబాబు మృతదేహాన్ని తరలిస్తున్నామని, ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం విమానం చెన్నై చేరుకుంటుందని ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. చెన్నై విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా మస్తాన్ బాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాడయుడు కూడా ఈ విషయాన్ని దృవీకరించారు.
గత మార్చి 24న పర్వతారోహణ చేస్తూ చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న మల్లి మస్తాన్ బాబు.. కొద్దిరోజులపాటు ఆచూకీ కనిపించకుండా పోయారు. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు నుంచి కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించి మస్తాన్ బాబు మృతదేహాన్ని గుర్తించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య మృతదేహం తరలింపులో కొంత ఆలస్యం ఏర్పడింది. సోమవారం లేదా మంగళవారం ప్రభుత్వం లాంఛనాలతో మస్తాన్ బాబు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.