24న స్వగ్రామానికి మల్లి మస్తాన్ బాబు మృతదేహం
దివంగత పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం ఈ నెల 24న స్వగ్రామానికి చేరనుంది. గురువారం రాత్రి 10:55 గంటలకు బ్యూనస్ఎయిర్స్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానం ద్వారా మృతదేహాన్ని చెన్నై ఎయిర్ పోర్టుకు తరలిస్తారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్లో మస్తాన్ బాబు పార్థివదేహాన్ని స్వగ్రామం గాంధీ జనసంఘానికి తీసుకువెళతారు. మస్తాన్ బాబు స్నేహితులు, కేంద్ర విదేశాంగ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా మృతదేహం తరలింపును చేపట్టారు. మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు తెలిపిన సమయం ప్రకారం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ఏపీ సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
గత మార్చి 24న పర్వతారోహణ చేస్తూ చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న మల్లి మస్తాన్ బాబు.. కొద్దిరోజులపాటు ఆచూకీ కనిపించకుండా పోయారు. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు నుంచి కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించి మస్తాన్ బాబు మృతదేహాన్ని గుర్తించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య మృతదేహం తరలింపులో కొంత ఆలస్యం ఏర్పడింది.