ప్రత్యేక హోదా విషయం ఏం చేశారు?
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి హామీ లేదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగం. పరిశ్రమలు వస్తాయి. ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రంగా విఫలమైంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక హోదాతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దానిపై ఏమీ చెప్పలేదు. మన్నవరం విద్యుత్ ప్రాజెక్టు కేవలం ప్రహరీకే పరిమితం అయిపోయింది. కొత్త ప్రాజెక్టులు ఒక్కటీ లేవు. సొంత జిల్లా అయిన చిత్తూరులో చక్కెర ఫ్యాక్టరీ మూసేస్తామని రైతులకు నోటీసు ఇచ్చారు. ఇదేజరిగితే రైతులు రోడ్డున పడతారు. గతంలో టీడీపీ హయాంలో 54 సంస్థలు అయితే మూతపడ్డాయి, లేకపోతే ప్రైవేటు పాలయ్యాయి.
సొంత జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీని కూడా కాపాడుకోలేకపోయారు. గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీపై కూడా ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించట్లేదు. ఢిల్లీ-ముంబై కారిడార్లా విశాఖ- చెన్నై కారిడార్ విషయం తేల్చలేదు. మన రాష్ట్రానికే చెందిన కేంద్రమంత్రి ఉన్నా.. అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా రావట్లేదు. కొత్త రైల్వే జోన్ విషయమై పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఉన్నా, దానిపై అతీగతీ లేదు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినా.. ప్రాజెక్టు కేవలం కాగితాలకే పరిమితం అవుతోంది. దానికోసం ఒక్క రూపాయి నిధులు కూడా టీడీపీ సర్కారు తెచ్చుకోలేకపోతోంది.