రాపూరు: వైఎస్సార్‌సీపీలో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబునాయుడు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా నియమించలేదన్నారు. మండలంలోని గోనుపల్లి గ్రామంలో నూతన రామమందిరంలో ఆదివారం జరిగిన కుంభాభిషేక మహోత్సవానికి జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి ఎంపీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కువైందని విమర్శించారు. గోనుపల్లి ఎస్టీకాలనీలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎంపీ నిధులు రూ.5లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఎస్‌ఎస్ కెనాల్ కోసం పోరాటం: జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి
సోమశిల స్వర్ణముఖి లింకు కెనాల్ కోసం పోరాడుతామని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌కెనాల్‌కు ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. అటవీశాఖ అనుమతులు రాలేదని అర్ధంతరంగా నిలిపివేశారన్నారు. ఎస్‌ఎస్ కెనాల్ పూర్తయితే గోనుపల్లి, రాపూరు చెరువులు రిజర్వాయర్లుగా మారుతాయన్నారు. ఎస్‌ఎస్ కెనాల్ కింద వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. ఎస్‌ఎస్‌కెనాల్ నిర్మాణానికి కృషి చేసి రైతులను ఆదుకుంటామన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి 1200 బోర్లు వేసేందుకు రూ.20కోట్లు అవసరమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బండి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ భవనానికి రూ.2లక్షలు మంజూరవుతాయన్నారు. ఈ సమావేశంలో పెంచలకోన మాజీ చైర్మన్ రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరావిురెడ్డి, పాపకన్ను దయాకర్‌రెడ్డి,సిద్దవరం సర్పంచ్ మురళీమోహన్ రెడ్డి, చెంచురావి రెడ్డి, మధుసూదనరెడ్డి, తిరుపాల్‌రెడ్డి, సర్పంచ్ శారద, ఎంపీటీసీ సభ్యురాలు యోజన పాల్గొన్నారు.