ఊగిసలాటలో ఎంపీడీఓలు
తేలని బదిలీల వ్యవహారం
మార్గదర్శకాల కోసం
పంచాయతీరాజ్ శాఖ
ఎదురుచూపు
రెండు రోజుల్లో కొలిక్కి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీఓ) బదిలీలపై ప్రతిష్టంభన తొలగలేదు. మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీఓలకు స్థానచలనం కలిగించాలనే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెళ్లడం.. బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోర్టు తేల్చి చెప్పడంతో ఈ వ్యవహారంపై సందిగ్ధత నెలకొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల విధుల్లో పాలుపంచుకునే ఎంపీడీఓలను బదిలీ చేయాలని ఈసీ నిర్దేశించింది. ఈ మేరకు మూడేళ్లు పైబడిన అధికారుల జాబితాను రూపొందించిన జిల్లా యంత్రాంగం దాన్ని ప్రభుత్వానికి నివేదించింది. ఎలక్షన్ డ్యూటీల్లో తమకు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ బదిలీల వర్తింపు సరికాదని ఎంపీడీఓల సంఘం కోర్టును ఆశ్రయించింది. జిల్లాస్థాయిలో తమకంటే ఎగువస్థాయిలో ఉన్న అధికారులను పక్కన పెట్టి తమనే బదిలీ చేయడం సహేతుకం కాదని వాదిస్తున్నారు. పోలింగ్ సమయంలో జోనల్ అధికారులుగా మాత్రమే వ్యవహరించే అవకాశమున్నందున.. తమను బదిలీల నుంచి మినహాయించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఒకవేళ బదిలీలు అనివార్యమైతే ఇతర జిల్లాలకు కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలోనే వేరే నియోజకవర్గానికి పంపించాలని కోరారు. ఎంపీడీఓల పిటిషన్‌కు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎన్నికల విధుల్లో ఎంపీడీఓల డ్యూటీలను నిర్దేశించాలని, ఆ మేరకు జాబితాను రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఎంపీడీఓల ఎన్నికల విధుల ఖరారుపై స్పష్టతను కోరుతూ జిల్లా కలెక్టర్‌కు పంచాయతీరాజ్ కమిషనర్ లేఖ రాశారు. దీనికి స్పందించిన జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సంబంధించిన ఏ విధులకైనా ఎంపీడీఓలను వినియోగించుకుంటామని తేల్చిచెప్పింది. అంతేగాకుండా బదిలీల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కూడా స్పష్టత లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ ఈ వ్యవహారంపై ఏమీ తేల్చుకోలేకపోతోంది. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో సాధారణ బదిలీలపై సడలించిన నిషేధం.. 11వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో ఎంపీడీఓల బదిలీకి, స్థానచలనాలకు సంబంధించిన బదిలీలపై 25వ తేదీ వరకు ఆంక్షలు సడలించాలని ప్రభుత్వానికి పీఆర్ వర్గాలు లేఖ రాశాయి. ఇదిలావుండగా.. బదిలీలపై స్పష్టత రాకపోవడంతో వారం రోజులుగా ఎంపీడీఓలు రాజధానిలోనే చక్కర్లు కొడుతున్నారు. ఏ క్షణంలోనైనా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కోరుకున్న పోస్టింగ్‌ను దక్కించుకోవాలనే ఎత్తుగడతో ఉన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 28 మంది ఎంపీడీఓలు బదిలీల జాబితాలో ఉన్నారు. కాగా, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జానారెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండడంతో ఆయన రాష్ట్రానికి తిరిగొచ్చిన తర్వాతే బదిలీల అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
ప్రతిష్టంభన!
Published Tue, Feb 18 2014 12:15 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement