'అన్ని సదుపాయాలున్న హైదరాబాద్ను వదలమంటే ఎలా?'
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని కోరారు. ఈ మేరకు వారు ఒక వినతిపత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరామని చెప్పారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర నష్టపోతుందని వివరించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ను యూటి చేస్తే ఇరుప్రాంతాలు నష్టపోతాయని చెప్పామన్నారు.
రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితంకావని, ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ ఉన్నాయని చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగం ఏది కావాలన్నా రాజధానికే రావలసిన పరిస్థితి ప్రస్తుతం ఉందని తెలిపారు. ఇప్పుడు మెట్రో రైలు కూడా వస్తోంది. ఇన్ని సదుపాయాలున్న హైదరాబాద్ వదిలి వెళ్లిపొమ్మంటే ఎలా అని ప్రశ్నించారు.
వీరు గత నెలలో కూడా రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. ఈ మేరకు వారు ఒక వినతి పత్రాన్ని గవర్నర్కు అందజేశారు.