పెంటపాడు : గ్రామంలో నివాసాల మధ్య ఉన్న మద్యం షాపును తొలగించాలని పెంటపాడులో మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. పెంటపాడు ఊరవు చెరువుగట్టు వద్ద గూడెం-భీమవరం రోడ్డు పక్కన మద్యం షాపు ముందు రాస్తారోకో చేశారు. నిరసనకు నాయకత్వం వహించిన వైఎస్సార్ సీపీ నాయకురాలు, ఎంపీటీసీ సభ్యురాలు పోతంశెట్టి లక్ష్మి స్థానిక గేట్ సెంటర్‌లో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఆమె మట్లాడుతూ తాగునీటి చెరువు పక్కన ఉన్న మద్యం షాపుతో చెరువులో పడి పలువురు తాగుబోతులు మరణించారని చెప్పారు. షాపుకు సమీపంలో సాయి మందిరం, కొద్ది దూరంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నా ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుకు ఎలా అనుమతి ఇచ్చార ని ప్రశ్నించారు.
గతంలో ఇక్కడ నుంచి మద్యం షాపు ఎత్తేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు షాపును ఇక్కడినుంచి మార్చాలని తెలిపినా యజమానులు ఖాతరు చేయ లేదన్నారు. దీనిపై పంచాయతీ కూడా తీర్మానం చేసి మద్యం షాపును ఊరికి దూరంగా పంపాలన్నారు. సెల్ టవర్ ఎక్కిన లక్ష్మిని ఆందోళన విరమించాలని గూడెం ఎక్సైజ్ సీఐ సుంకర సాయి స్వరూప్ కోరారు. అధికారులు పుష్కరాల డ్యూటీలో ఉన్నారన్నారు. షాపు యజమాని ఇక్కడి నుంచి షాపును మార్చుకొనేందుకు అంగీకరించారన్నారు. అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఏలూరు ఎక్సైజ్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. లక్ష్మి ఆందోళన విరమించారు. సీపీఐ నాయకులు కళింగ లక్ష్మణరావు పాల్గొన్నారు.
సెల్ టవర్ ఎక్కిన ఎంపీటీసీ సభ్యురాలు
Published Sat, Jul 18 2015 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement