రైతులతో చెలగాటం | Mr. farmers | Sakshi
Sakshi News home page

రైతులతో చెలగాటం

Published Tue, Jun 10 2014 4:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రైతులతో చెలగాటం - Sakshi

రైతులతో చెలగాటం

  •      ఏడాదిగా నకిలీ విత్తనాల తయారీ
  •      రైతుల నుంచి కొన్న విత్తనాలకే రంగుపూసి తిరిగి విక్రయం
  •      నకిలీ పత్తి విత్తనాలతో భారీ స్థాయిలో రైతులకు నష్టం
  •      బి.కొత్తకోటలో అనుమానంరాని చోట అద్దె ఇల్లు
  •      రెండు కేసుల నమోదు
  • బి.కొత్తకోట: నకిలీ విత్తనాలు తయారుచేస్తూ రైతుల జీవితాల్లో చెలగాటమాడాడు. ఏడాదికాలంగా గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రం లోని ఐదు జిల్లాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తివిత్తనాలను విక్రయించాడు.. కర్ణాటకకు చెందిన ఓ కంపెనీ పేరుతో విక్రయాలు చేస్తూ పత్తిరైతులను నట్టేట ముంచాడు. ఎవరికీ అనుమానం రాకుండా  బి.కొత్తకోటలో మకాం వేసి విత్తనాల తయారు చేస్తున్నాడు ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఎస్.లక్ష్మణాచారి. సోమవారం రాత్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడిలో నకిలీ విత్తనాల వ్యవహారం వెలుగుచూసింది.
     
    ఖమ్మం జిల్లా మండల కేంద్రం వైరాకు చెందిన ఎస్.లక్ష్మణాచారి(30) గతంలో ఆదర్శ సీడ్స్‌లో పనిచేస్తుండేవాడు. కంపెనీ నుంచి ఇతన్ని తొలగించడంతో నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. పడమటి ప్రాంతమైన బి.కొత్తకోటను కేంద్రంగా చేసుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించి, స్థానిక శెట్టిపల్లె రోడ్డులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమీపంలోని ఓ పూలవ్యాపారికి చెందిన భవనంలో గదిని అద్దెకు తీసుకొన్నాడు.

    ఇందులో ఎవరు ఏం చేస్తున్నారన్న విషయం బయటకు పొక్కదు. దీంతో ఇంతకాలం ఈ నకిలీ వ్యవహారం గుర్తించే వీలులేకుండా పోయిందని భావిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాల తయారీ కోసం మొదట పలు ప్రాంతాల్లో రైతులు పండించిన పత్తి విత్తనాలను కొనుగోలు చేసి  నిల్వ ఉంచుతాడు. ఈ విత్తనాలకు రంగుపూసి కర్ణాటకలోని గల్బర్గాకు చెందిన అజిత్ పత్తివిత్తనాల కంపెనీపేరుతో ప్యాకెట్లు, లోగోను బెంగళూరులో తయారుచేయిస్తాడు.

    ఈ విషయం దాడులు చేసిన విజిలెన్‌‌స అధికారులు పేర్కొన్నారు. వీటిలో అరకిలో నకిలీ పత్తి విత్తనాలను నింపి రూ.930 చొప్పున విక్రయిస్తున్నట్టు వారు గుర్తించారు. అజిత్ పత్తి విత్తనాల కంపెనీ పేరు, అదే రకమైన ప్యాకింగ్ ఉండడంతో రైతులు నకిలీ విత్తనాలు గుర్తించే వీలులేకుండా పోతోంది. వీటిని కొనుగోలుచేసి పంటసాగుచేసిన పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయి ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతిజిల్లాకు వీటిని సరఫరా చేసివుంటారని అనుమానిస్తున్నారు.

    తెలంగాణ జిల్లాలు, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలో లక్ష్మణాచారికి పరిచయాలున్న వారితో రైతులకు విక్రయాలు చేసివుంటారని చెబుతున్నారు. గతంలో పనిచేసిన కంపెనీలోని ఉద్యోగులతో పరిచయాలుంటాయని వారి సహకారం తీసుకొని ఉంటాడని వారు అనుమానిస్తున్నారు. గదిలో 291 అరకేజీల ప్యాకెట్లు, మరో 291 చిన్నప్యాకెట్లను సాధ్వీనం చేసుకొన్నారు.

    అలాగే 336 కిలోల పత్తి విత్తనాలు, రంగు సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ రూ.9 లక్షలు ఉంటుందని విజిలెన్స్ సీఐలు సూర్యనారాయణ, శ్యామ్‌సుందర్  చెప్పారు. ఈ వ్యవహారంపై బి.కొత్తకోట వ్యవసాయాధికారి జీఎన్.నాగప్రసాద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. లక్ష్మణాచారిపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు. ఇతనిపై రెండు కేసులు నమోదవుతాయని విజిలెన్స్ సీఐ యూ.సూర్యనారాయణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement