వంద కోట్లతో ఎంఎస్‌ఎంఈ
అమరావతిలో పరిశ్రమల అభివృద్ధి సంస్థ: సీఎం
సాక్షి, అమరావతి: వంద కోట్ల రూపాయల నిధితో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాజధాని అమరావతిలో ఎంఎస్‌ఎంఈ కార్పొరేట్ భవన నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ చార్జీలు ఇక పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పారు. ప్రపంచ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ లోగోను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 237 ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్లను అనుసంధానం చేసి, అమరావతి కార్యాలయం నుంచే పురోగతిని పరిశీలించే ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాకో ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.