‘సైకిల్’పై మళ్లీ..సై! | Mudragada Padmanabham again join in TDP | Sakshi
Sakshi News home page

‘సైకిల్’పై మళ్లీ..సై!

Published Mon, Dec 30 2013 1:03 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM

‘సైకిల్’పై మళ్లీ..సై! - Sakshi

‘సైకిల్’పై మళ్లీ..సై!

సాక్షి ప్రతినిధి, కాకినాడ : కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ, ‘మౌనవ్రతం’ పాటిస్తున్నట్టున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఎన్నికలు చేరువవుతున్న సమయంలో మళ్లీ బరిలోకి రానున్నట్టు తెలుస్తోంది. ఆయన  రాజకీయ మౌనముద్ర వీడి 2014 ఎన్నికల బరిలో నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారని అనుచరవర్గం చెబుతోంది. రాజకీయ పునరాగమనానికి ఆయన.. ఒకప్పుడు తనకు మంత్రిగా, ఎంపీగా అవకాశమిచ్చిన తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

ఈ మేరకు గత రెండు రోజులుగా ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు మంతనాలు సాగిస్తుండటంతో.. ఆయన వస్తే ఎవరికి అవకాశాలకు ఎసరు పెడతారోనని ఆ పార్టీలోని కొన్ని నియోజకవర్గాల నాయకులు గుబులు పడుతుండగా, ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీరుస్తుందన్న’ చందంగా కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ కోసం జరుగుతున్న సిగపట్లకు పరిష్కారమవుతుందని కొందరు ఆనందిస్తున్నారు. ప్రధానంగా మెట్ట ప్రాంత నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు నాయకులు ముద్రగడ వస్తారనే సమాచారంతో ఆందోళన చెందుతున్నారు.

ముద్రగడే గనుక పార్టీలోకి వస్తే ఆయనకు పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ఏ స్థానం కేటాయిస్తారనేది టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గాల్లో సీట్లు ఆశిస్తున్న తెలుగుతమ్ముళ్లకు ముద్రగడ పునరాగమనం రుచించడం లేదు. ప్రత్తిపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు సహా పలువురు నేతలకు ఈ కబురు చేదుమాత్రలా మింగుడుపడటం లేదు.
 ‘నూకలు చెల్లాయని’ కాంగ్రెస్‌పై విముఖత
 ముద్రగడ 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి కాపు సామాజికవర్గంలో బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో వివిధ పదవులు అధిష్టించారు. ఆ రెండు పార్టీల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికైన ఆయన రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఓటమి పాలయ్యారు. అనంతరం కొద్దికాలం వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్నారు. కారణాంతరాలతో ముద్రగడ ఆ తరువాత రాజకీయాలకు దూరమై మౌనంగా ఉంటున్నారు.

 రాజకీయాలకు దూరమయ్యాక పూర్వ పరిచయాల నేపథ్యంతో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముద్రగడను గతంలో ఆహ్వానించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొన్నినెలల క్రితం ముద్రగడ ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో తమ భేటీ వ్యక్తిగతమేనని, రాజకీయ ప్రాధాన్యం లేదని బొత్స కొట్టిపారేయడం తెలిసిందే. ఇంతలో రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడం, సీమాంధ్రలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితులు నెలకొనడంతో ఆ పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నారనే ప్రచారం జరిగింది. దశాబ్దకాలంపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి నూకలు చెల్లిపోయినట్టేనని తన అనుచరుల వద్ద ముద్రగడ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో అభిప్రాయపడటం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.

 సంక్రాంతికి ముందే పునరాగమనం..!
 నాలుగైదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముద్రగడ రాజకీయ పునరాగమన అంశం తెరపైకి వచ్చింది. ఆయన టీడీపీలోకి రావడం, టిక్కెట్టు ఇవ్వడం ఒకేసారి జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు మండలిలో విపక్ష నేత, ఒకప్పటి ముద్రగడ సహచరుడు యనమల రామకృష్ణుడు ఆయనతో మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. రామకృష్ణుడి తమ్ముడు కృష్ణుడు, ఆ పార్టీ నుంచి కాకినాడ పార్లమెంటు టిక్కెట్టు ఆశిస్తున్న పోతుల విశ్వం తదితరులు ముద్రగడతో మంతనాలు సాగించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీడీపీలోకి వచ్చేందుకు ముద్రగడ సుముఖత వ్యక్తం చేశారనే ప్రచారం మెట్టప్రాంతంలో జోరందుకుంది. ముద్రగడ రావడం ఖాయమైతే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత లేక ఆ పార్టీ నేతలు ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతికి ముందే ముద్రగడ ‘సైకిల్’ ఎక్కుతారంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement