parvata chitti babu
-
జిల్లా ‘దేశం’అధ్యక్షునిగా పర్వత
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం కాకినాడ సూర్యకళామందిరంలో జిల్లా జరిగింది. పార్టీ పరిశీలకులుగా హాజరైన జలవనరుల మంత్రి, జిల్లా ఇన్చార్జిమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, బి.బ్రహ్మయ్య నాయుడు సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. పార్టీ కన్వీనర్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబును అధ్యక్షుడిగా ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. పారీ ప్రధాన కార్యదర్శిగా శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి పేరూరు సర్పంచ్ పెచ్చెట్టి చంద్రమౌళిని ఎన్నుకొన్నారు. అనంతరం పార్టీ జిల్లా కమిటీని 70 మందితో ఏర్పాటుచేశారు. ఐదుగురు ఉపాధ్యక్షులు, 15 మంది వంతున సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఒక ప్రచార కార్యదర్శి, ముగ్గురు అధికార ప్రతినిధులు, ఒక కార్యాలయ కార్యదర్శి, మరో 40 మంది కార్యవర్గ సభ్యులతో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అనుబంధ కమిటీల సారథులు వీరే.. అలాగే అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులను కూడా ఎన్నుకున్నారు. తెలుగురైతు అధ్యక్షుడిగా కందుల కొండయ్యదొర, ప్రధాన కార్యదర్శిగా గంగుమళ్ల సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షుడిగా కటకంశెట్టి సత్యప్రభాకర్(బాబీ), ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్, తెలుగు మహిళ అధ్యక్షురాలిగా గుత్తుల అచ్చాయమ్మ, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా గ్రంది బాబ్జీ, టీఎన్టీయూసీ అధ్యక్షుడిగా నక్కా రాజబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా ఎలుబంటి రాఘవరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షునిగా రాచపల్లి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా దండుప్రోలు నాగబాబు, బీసీ సెల్ అధ్యక్షుడిగా గుత్తుల రమణ, ఎస్సీ సెల్ అధ్యక్షునిగా కాశి పరివాజ్‌కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షునిగా తాజుద్దీన్, సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా తోట ఆనందరాావును ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ మాదిరిగానే అనుబంధ కమిటీలను పూర్తిస్థాయిలో నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. అనంతలక్ష్మి దంపతుల అలక! కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, ఇంతవరకు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పిల్లి సత్యనారాయణ(సత్తిబాబు) ఈ ఎన్నికల సమావేశానికి దూరంగా ఉన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదరి పదవిని తనకు కాక చంద్రమౌళికి కట్టబెట్టారని సత్తిబాబు అలక వహించారనే ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ సమావేశానికి హాజరు కాకపోవడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లా పర్యటన సందర్భంలో హెలిపాడ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుని అవమానించినా పార్టీ నేతలు పట్టించుకోలేదనే కారణంతో సత్తిబాబు దంపతులు జిల్లా ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎమ్మెల్యేల మాటలతో కార్యకర్తల అయోమయం కాగా, కార్యవర్గ ఎన్నిక సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు తలో రకంగా మాట్లాడి కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేశారు. బీజేపీతో పొత్తు కేవలం ప్రగతి కోసమేగాని, రాజకీయాలు చేయడానికి కాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి, ప్రభుత్వ పథకాల్లో సాంకేతిక లోపాలను పార్టీ కార్యకర్తలే విమర్శించడం తగదని మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నమాటలు కార్యకర్తలను అయోమయూనికి గురిచేశాయి. కార్యకర్తలు ప్రభుత్వ పనుల్లో ఎన్ని లోపాలున్నా కప్పిపుచ్చాలేగాని విమర్శించవద్దన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీలు మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, జడ్పీై చెర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు, ఎస్వీఎస్ వర్మ, పెందుర్తి వెంకటేష్, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బాబు, ఎమ్మెల్సీలు కేవీవీ రవికిరణ్, బొడ్డు భాస్కరరామారావు, పారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
‘సైకిల్’పై మళ్లీ..సై!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ, ‘మౌనవ్రతం’ పాటిస్తున్నట్టున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఎన్నికలు చేరువవుతున్న సమయంలో మళ్లీ బరిలోకి రానున్నట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయ మౌనముద్ర వీడి 2014 ఎన్నికల బరిలో నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారని అనుచరవర్గం చెబుతోంది. రాజకీయ పునరాగమనానికి ఆయన.. ఒకప్పుడు తనకు మంత్రిగా, ఎంపీగా అవకాశమిచ్చిన తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు గత రెండు రోజులుగా ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు మంతనాలు సాగిస్తుండటంతో.. ఆయన వస్తే ఎవరికి అవకాశాలకు ఎసరు పెడతారోనని ఆ పార్టీలోని కొన్ని నియోజకవర్గాల నాయకులు గుబులు పడుతుండగా, ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీరుస్తుందన్న’ చందంగా కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ కోసం జరుగుతున్న సిగపట్లకు పరిష్కారమవుతుందని కొందరు ఆనందిస్తున్నారు. ప్రధానంగా మెట్ట ప్రాంత నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు నాయకులు ముద్రగడ వస్తారనే సమాచారంతో ఆందోళన చెందుతున్నారు. ముద్రగడే గనుక పార్టీలోకి వస్తే ఆయనకు పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ఏ స్థానం కేటాయిస్తారనేది టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గాల్లో సీట్లు ఆశిస్తున్న తెలుగుతమ్ముళ్లకు ముద్రగడ పునరాగమనం రుచించడం లేదు. ప్రత్తిపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు సహా పలువురు నేతలకు ఈ కబురు చేదుమాత్రలా మింగుడుపడటం లేదు. ‘నూకలు చెల్లాయని’ కాంగ్రెస్‌పై విముఖత ముద్రగడ 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి కాపు సామాజికవర్గంలో బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో వివిధ పదవులు అధిష్టించారు. ఆ రెండు పార్టీల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికైన ఆయన రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఓటమి పాలయ్యారు. అనంతరం కొద్దికాలం వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్నారు. కారణాంతరాలతో ముద్రగడ ఆ తరువాత రాజకీయాలకు దూరమై మౌనంగా ఉంటున్నారు. రాజకీయాలకు దూరమయ్యాక పూర్వ పరిచయాల నేపథ్యంతో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముద్రగడను గతంలో ఆహ్వానించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొన్నినెలల క్రితం ముద్రగడ ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో తమ భేటీ వ్యక్తిగతమేనని, రాజకీయ ప్రాధాన్యం లేదని బొత్స కొట్టిపారేయడం తెలిసిందే. ఇంతలో రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడం, సీమాంధ్రలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితులు నెలకొనడంతో ఆ పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నారనే ప్రచారం జరిగింది. దశాబ్దకాలంపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి నూకలు చెల్లిపోయినట్టేనని తన అనుచరుల వద్ద ముద్రగడ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో అభిప్రాయపడటం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. సంక్రాంతికి ముందే పునరాగమనం..! నాలుగైదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముద్రగడ రాజకీయ పునరాగమన అంశం తెరపైకి వచ్చింది. ఆయన టీడీపీలోకి రావడం, టిక్కెట్టు ఇవ్వడం ఒకేసారి జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు మండలిలో విపక్ష నేత, ఒకప్పటి ముద్రగడ సహచరుడు యనమల రామకృష్ణుడు ఆయనతో మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. రామకృష్ణుడి తమ్ముడు కృష్ణుడు, ఆ పార్టీ నుంచి కాకినాడ పార్లమెంటు టిక్కెట్టు ఆశిస్తున్న పోతుల విశ్వం తదితరులు ముద్రగడతో మంతనాలు సాగించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీడీపీలోకి వచ్చేందుకు ముద్రగడ సుముఖత వ్యక్తం చేశారనే ప్రచారం మెట్టప్రాంతంలో జోరందుకుంది. ముద్రగడ రావడం ఖాయమైతే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత లేక ఆ పార్టీ నేతలు ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతికి ముందే ముద్రగడ ‘సైకిల్’ ఎక్కుతారంటున్నారు.