చావో.. రేవో..చలో అమరావతి
జూలై 26 నుంచి పాదయాత్ర: ముద్రగడ
జగ్గంపేట: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమబాట పట్టనున్నారు. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ హామీని అమలు చేయాలని కోరుతూ పలు దఫాలుగా ఉద్యమాలు నిర్వహించిన ముద్రగడ ఈసారి ‘చావో.. రేవో.. చలో అమరావతి’ పిలుపుతో నిరవధిక పాదయాత్రకు సంకల్పిస్తున్నారు.
ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 26న కిర్లంపూడి నుంచి పాదయాత్ర ద్వారా రాజధానికి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు.