
నంద్యాల అర్బన్: ఇచ్చిన హామీ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. బలిజల ఆత్మీయ కలయికలో భాగంగా శనివారం నంద్యాల పట్టణం త్రినేత్ర గెస్ట్‌లైన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో కాపులకు బీసీ ఎఫ్ కోటాలో దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
మార్చి 31లోగా కాపులకు బీసీ ఎఫ్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలన్నారు. కాపుల బీసీ జాబితా బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సిన అవసరం లేదన్నారు. రిజర్వేషన్లు ఇస్తున్నామని రెకమెండ్ చేయాలని మాత్రమే చెప్పవచ్చన్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం అన్యాయమన్నారు. ‘‘అధికారం ఇవ్వండి.. మీ జాతికి రిజర్వేషన్లు కల్పిస్తామం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఉద్యమాలు చేస్తుంటే అణగదొక్కాలని చూడటం దారుణమన్నారు. డబ్బు, పదవుల కోసం తాను పోరాటం చేయలేదన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం గ్రామ గ్రామానా తిరిగి ఆత్మీయ బంధువులను కలవాలని ఉందని అన్నారు.
బలిజ నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ కాపు జాతి కోసం దివంగత నేత వంగవీటి మోహన్‌రంగ తర్వాత ముద్రగడ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ ఇంత వరకు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేశామని, ఇప్పుడు అమలు కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భావి తరాల భవిష్యత్తు కోసం బలిజ సంఘీయులంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని నల్ల విష్ణు అన్నారు. కాపులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ సిద్దం శివరాం అన్నారు. అడ్వకేట్ శ్రీనివాసులు, జగన్‌ప్రసాద్, ఓబులపతి, సుబ్బారెడ్డి, గోపాల్, కైలాసనాథ్ పాల్గొన్నారు.
చిత్తశుద్ధి కనపడటం లేదు..
కాపులను బీసీలో చేర్చే రిజర్వేషన్ల జాబితాపై చంద్రబాబుకు చిత్తశుద్థి కనపడటం లేదని కాపునేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆత్మీయ సమ్మేళనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులను బీసీ ఎఫ్ జాబితాలో చేర్చే విషయం రాష్ట్రస్థాయిలో ఉన్నా కేంద్రానికి పంపడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.