కాపు రిజర్వేషన్ల పోరుబాటతో వార్తల్లోకెక్కిన కిర్లంపూడికి జనం పోటెత్తుతున్నారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపడుతున్న పాదయాత్రను నెల రోజులుగా ప్రభుత్వం నిలువరిస్తోంది.
జగ్గంపేట : కాపు రిజర్వేషన్ల పోరుబాటతో వార్తల్లోకెక్కిన కిర్లంపూడికి జనం పోటెత్తుతున్నారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపడుతున్న పాదయాత్రను నెల రోజులుగా ప్రభుత్వం నిలువరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి వద్ద శిబిరంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు ముద్రగడకు రాష్ట్రం నలుమూలల నుంచి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు భారీగా తరలివచ్చి మద్దతు తెలియజేసి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
శనివారం విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్యెల్యే కంబాల జోగులు ముద్రగడను కలిసి మద్దతు తెలిపారు. ఆయన చేపడుతున్న ఉద్యమం న్యాయసమ్మతంగా ఉందని ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలన్నారు. కొత్తపేట నియోజకవర్గం వానపాలెం గ్రామానికి చెందిన కాపులు ముద్రగడను కలిసి మద్దతు ప్రకటించారు. జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అక్కడ నుంచి వచ్చిన బండారు సూర్యనారాయణ, వెంకట సుబ్బారావు, పిండి సత్తిబాబు, తదితరులను పరిచయం చేశారు. కాకినాడ అడ్వకేట్ జేఏసీ నాయకులు పేపకాయల రామకృష్ణ, తుమ్మలపల్లి ప్రసాద్, తుమ్మలపల్లి చంద్రశేఖర్, చక్కపల్లి చంటిబాబు తదితరులు ముద్రగడను కలిసి మద్దతు తెలిపారు.
అలాగే ఏలూరు నుంచి బస్సులో వచ్చిన కాపు సంఘం నాయకులు ముద్రగడను కలిసి మద్దతు తెలిపి కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం తీరును విమర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా ముద్రగడను కలిసేందుకు తరలివచ్చారు. నిరసనలో కాపు జేఏసీ నేతలు కల్వకొలను తాతాజీ, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, గోపు అచ్యుతరామయ్య, రౌతు స్వామి, తుమ్మలపల్లి రమేష్, ఆరేటి ప్రకాష్, జీవీ రమణ, చక్కపల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.