సమైక్య ఉద్యమానికి మున్సిపల్ కమిషనర్ల మద్దతు
Published Sat, Aug 24 2013 3:33 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
తెనాలిరూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి మున్సిపల్ కమిషనర్ల సంఘం మద్దతు ప్రకటించింది. మున్సిపల్ ఉద్యోగులు ఈ నెల 13వ తేదీ నుంచి చేపట్టిన విధుల బహిష్కరణకు కమిషనర్లు పూర్తి మద్దతు తెలిపారు. సీమాంధ్రలోని 13 జిల్లాల పురపాలక సంఘ కమిషనర్లు ఈ నెల 26 నుంచి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొననున్నట్టు రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ల సంఘం వైస్ చైర్మన్, మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక రహదారి బంగళా ఆవరణలోని మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ల సమావేశం నిర్వహించారు.
ఉద్యమానికి మద్దతుగా చేపట్టనున్న కార్యక్రమాల గురించి చర్చించారు. అనంతరం శ్రీనివాసరావు విలేకర్లకు తమ ప్రణాళికను వివరించారు. ఈనెల 26న కమిషనర్లందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, 27, 28 తేదీల్లో రెండు రోజుల మాస్ క్యాజువల్ లీవ్ పెడతామని, 27వ తేదీన పురపాలక సిబ్బందితో సమ్మెలో పాల్గొని, 28న సిబ్బందితో సహా ఆయా జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటారని చెప్పారు. 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఎన్‌జీఓలు, మున్సిపల్ సిబ్బందితో కలసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలియజేస్తారని, సెప్టెంబర్ 2వ తేదీన రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వీధి దీపాలను ఆర్పి వేసి నిరసన తెలుపుతారన్నారు.
3, 4 తేదీల్లో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఈ-మెయిల్స్, పోస్ట్ కార్డులు పంపే కార్యక్రమాలు, 7, 8 తేదీల్లో ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు సమైక్యాంధ్ర పోస్టర్లు, స్టిక్కర్లు అంటించడం, 10, 11 తేదీల్లో స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్టు కమిషనర్ల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి.బాలస్వామి వివరించారు.
పజలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తితే మినహా ఉద్యమాన్ని ఆపేది లేదని కమిషనర్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రేపల్లె పొన్నూరు, సత్తెనపల్లి, మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట పురపాలక సంఘాల కమిషనర్లు, కమిషనర్ల సంఘం కో కన్వీనర్లు సంపత్‌కుమార్, జశ్వంత్‌రావు, భానుప్రసాద్, శ్రీనివాసరావు, శివారెడ్డి, ఏసుదాస్, తెనాలి అసిస్టెంట్ కమిషనర్ కల్లూరి వసంతలక్ష్మి, రెవెన్యూ అధికారి బి.విజయసారధి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement