విభజన ప్రక్రియను అడ్డుకుంటాం
Published Thu, Nov 21 2013 2:25 AM | Last Updated on Thu, Mar 28 2019 6:27 PM
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం జరుగుతున్న రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు విద్యార్థులంతా సిద్ధంగా ఉన్నారని వర్సిటీ వ్యాయామ కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు బుధవారం వర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్సిటీ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రోడ్డుపైనే వ్యాయామం, ధ్యానం చేసి నిరసన తెలిపారు. అనంతరం రిలే నిరాహారదీక్షలకు దిగారు.
దీక్షలను ఏఎన్‌యూ అధ్యాపక జేఏసీ నాయకులు ఆచార్య పి.వరప్రసాదమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఒంటెద్దుపోకడలు పోతూ రాష్ట్రాన్ని విభజించేందుకు వేగంగా ముందుకు సాగుతోందన్నారు. కేంద్రం తన వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీజేపీ మాజీ రాష్ట్ర నాయకుడు అనుమోలు గాంధీ మాట్లాడుతూ బీజేసీ, సీపీఐ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను నిలదీసి వారి కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడితే ఆ పార్టీలు రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాన్ని మార్చుకుంటాయన్నారు.
కార్యక్రమంలో అధ్యాపక జేఏసీ నాయకులు డాక్టర్ పి.జాన్సన్, డాక్టర్ రవికుమార్, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వెంకటరమణ, ఉద్యోగ జేఏసీ నాయకులు కోడూరి కనకరాజు, ఏఎన్‌యూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కె.కిషోర్, నాయకులు బి.ఆశిరత్నం, పి.శ్యాంసన్, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కూసం బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీక్షలను సాయంత్రం వర్సిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జిమ్మీరాణి విరమింపజేశారు.
Advertisement
Advertisement