ముందడుగేదీ?
Published Sun, Jan 19 2014 5:12 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
సాక్షి ప్రతినిధి, తిరుపతి:ఒకప్పుడు మున్సిపాలిటీ, ఇప్పుడు కార్పొరేషన్. మున్సిపాలిటీగా ఉన్నప్పుడే తిరుపతిలో ఎన్నికలు ఆగిపోయాయి. మున్సిపల్ చైర్మన్ పదవిని ఎస్టీలకు రిజర్వు చేసిన అధికారుల తీరును ప్రశ్నిస్తూ కొందరు కోర్టుకు వెళ్లారు. 2006, ఫిబ్రవరి 6 నుంచి ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లింది. 2007లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అరుు్యంది. ప్రస్తుతం కార్పొరేషన్ జనాభా 3,87,482గా ఉంది. ఇందులో ఎస్టీలు సుమారు ఆరువేల మంది ఉండగా, ఎస్సీలు మూడు వేల మంది ఉన్నారు. మిగిలిన వారంతా బీసీ, ఓసీలే. నగరంలో బీసీల జనాభా 45 శాతం ఉంటుంది.
మార్పులేని వైనం...
తిరుపతి నగరంగా మారినా వసతుల కల్పనలో ఎనిమిదేళ్లుగా ఎటువంటి మార్పు లేదు. కార్పొరేషన్ అయిన తరువాత కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. జిల్లా పరిపాలనలో అన్నీ తానై నడిపించే కలెక్టర్ కూడా తిరుపతి నగరాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ కౌన్సిలర్లు చేసిన విజ్ఞప్తులను అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
మంచినీటి కోసం పడరాని పాట్లు...
తిరుపతి నగరం పుణ్యక్షేత్రం కావడంతో నిత్యం 40వేల మందికి పైగా సందర్శకులు వస్తుం టారు. నగరంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది ప్రజలకు తాగునీరు కరువైంది. కార్పొరేషన్‌లో కలిసిన మూడు పంచాయతీల్లో సుమారు లక్ష మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాకు 15 రోజులకు ఒకసారి తాగు నీరు అందిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని బయట తెప్పించుకుని అక్కడి జనం కొనుగోలు చేస్తున్నారు. ఇంత పెద్ద కార్పొరేషన్‌లోతాగునీటికి ఈ దుస్థితి ఎందుకు దాపురించిందనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సి ఉంది. వర్షాలు లేకపోవడంతో కళ్యాణి డ్యామ్‌లో నీరు లేదు. కేవలం తెలుగుగంగ ప్రాజెక్టు నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. నీటి వనరులు ఉపయోగించుకుని తాగునీటి కొరత లేకుం డా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.
ప్రాథమిక చికిత్స కూడా దూరం...
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రాథమికంగా చికిత్స నిర్వహించే అర్బన్ హెల్త్ సెంటర్‌లు కూడా జబ్బున పడ్డారుు. ప్రస్తుతం కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెండు సెంటర్లు నిర్వహిస్తుండగా, మరో మూడు ఎన్జీవోలు నిర్వహిస్తున్నారు. నిజానికి నగరంలో జనాభాకు అనుగుణంగా మరో పది అర్బన్ హెల్త్ సెంటర్‌లు అవసరం. నిబంధనల ప్రకారం ఐదువేల మందికి ఒక హెల్త్ అసిస్టెంట్ ఉండాలి. కనీసం 20వేల మంది కి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. కానీ నగరంలో ఖరీదైన వైద్యం తప్ప పేదలకు అందుబాటులో ప్రథమ చికిత్స కూడా లేదు. కుటుంబ సంక్షేమ శాఖ వారు తిరుపతికి వంద పడకల ప్రసూతి కేంద్రాన్ని మంజూరు చేసినా అధికారులు పట్టించుకోలేదు.
నాడు ఎస్టీ... నేడు...?
2006లో కార్పొరేషన్‌ను అతితక్కువ జనాభా ఉన్న ఎస్టీలకు రిజర్వు చేశారు. ఎందుకు ఇలా చేశారంటూ కోర్టును కొందరు ఆశ్రయించడంతో అప్పట్లో ఎన్నికలు ఆగిపోయాయి. ఆ తరువాత సంవత్సరాలు గడుస్తున్నా దీని గురించి పట్టించుకున్న వారు లేరు. ప్రస్తుతం 50 డివిజన్‌లు ఉన్నాయి. బీసీ జనాభా అధికంగా ఉన్నందున వచ్చే ఎన్నికల్లో బీసీలకు కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీ య పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తూ పోతుండడంతో ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. పాలకుల వద్దకు వెళ్లినంత చొరవగా అధికారుల వద్దకు వెళ్లి ప్రశ్నించలేకపోతున్నారు.
సీఎం హామీలు ఏమయ్యాయి...?
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుపతి కార్పొరేషన్ అభివృద్ధికి వివిధ పథకాల కింద సుమారు రూ. 400 కోట్ల విలువైన హామీలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, ఆయన ఆ విషయాలు ఎప్పుడో మరిచిపోయారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ గెలుపొందడంతో సీఎం నిధుల విడుదల విషయాన్ని మరిచిపోయారు. ఎనిమిదేళ్లుగా నగరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదల కాకపోవడంతో నగరం అభివృద్ధి పథంలో ముందడుగు వేయలేని పరిస్థితిలో ఉంది.
Advertisement
Advertisement