ప్రజాసంఘాలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నస్రిన్
ప్రొద్దుటూరు క్రైం : తన ఇంటిని అమ్మడమే గాక మరో పెళ్లి చేసుకోడానికి తన భర్త ప్రయత్నిస్తున్నాడని ఇస్లాంపురం వీధికి చెందిన షేక్.నస్రీన్ అనే మహిళ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆమె ప్రజాసంఘాలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తనకు ముంబయికి చెందిన ఇబ్రహీంతో వివాహం అయిందన్నారు. తన బంగారు నగలను విక్రయించి 2011లో ఇంటిని కొన్నట్లు తెలిపారు. ఆ ఇల్లు తన భర్త పేరుతోనే ఉండటంతో 5 నెలల నుంచి వేధిస్తున్నాడన్నారు. తనను భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో రిమ్స్‌లోని ఐసీడీఎస్ ఉమెన్‌సెల్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇళ్లు అమ్మేశాడని, రూ.15 లక్షల ఇంటిని రూ.2.5 లక్షలకు మాత్రమే తన బంధువులకు రాయించినట్లు ఆమె తెలిపారు. తన స్లాబ్ ఇంటిని చౌడు మిద్దెగా చూపించి తప్పుడు రిజిష్టర్ చేయించాడన్నారు. అయితే రిజిస్ట్రార్ అధికారులు చూడకుండా ఎలా రిజిష్టర్ చేస్తారని ఆమె ప్రశ్నించారు.
దీనిపై కలెక్టర్, జిల్లా జడ్జికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయమై పెద్ద మనుషులతో మాట్లాడటానికి ఆమె నాలుగు రోజుల క్రితం జమ్మలమడుగుకు వెళ్లగా తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న సామాన్లను లారీలో తరలించి ఇల్లు ఖాళీ చేశాడన్నారు. నాలుగు రోజుల నుంచి తన ఏడేళ్ల కుమార్తెతో కట్టుబట్టలతో రోడ్డుపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో తన అమ్మగారింట్లో ఆశ్రయం పొందుతున్నామని తెలిపారు. తనను వేధింపులకు గురి చేయడమే కాకుండా రెండో పెళ్లి చేసుకొని సౌదీకి వెళ్లేందుకు తన భర్త ప్రయత్నిస్తున్నాడని నస్రీన్ పేర్కొన్నారు. గతంలో తన భర్తపై ముంబయి, సౌదీలో కేసులున్నాయని ఆమె ఆరోపించారు. తన తల్లిదండ్రులు కొనిచ్చిన వస్తువులన్నీ అతను తీసుకెళ్లాడని చెప్పారు. అందులో బంగారు నగలు, దుస్తులు, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ ఉన్నాయన్నారు. గతంలోనే నేర చరిత్ర ఉన్న తన భర్తపై వెంటనే కేసు నమోదు చేసి పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఇప్పటికే ఎస్పీ, వన్‌టౌన్ సీఐ, డీఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు ఖలందర్, శ్రీను, లక్ష్మిదేవి, మెహరున్నిసా, హరిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment