విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పద్ధతులను మెరుగుపరచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నించాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. బడి ఈడు పిల్లలంతా బడుల్లోనే ఉండాలని, బడి బయట ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం విద్యాశాఖ అధికారులకు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హ్యాబిటేషన్ల వారీగా ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను చైతన్యపరచి ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఎంఈఓలు పాలనాపరమైన వ్యవహారాలే కాకుండా విద్యాబోధనపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో ప్రకటించిన పదో తరగతి పరీక్షల్లో 87 శాతం ఉత్తీర్ణత సాధించడం, చీరాల, చినగంజాం మండలాల్లో 74 శాతం మాత్రమే ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన, మారుమూల ప్రాంతాలైన సీఎస్‌పురం, వెలిగండ్ల, గుడ్లూరు మండలాల్లో 90 శాతానికిపైగా ఫలితాలు సాధిస్తే.. అభివృద్ధి చెందిన చీరాల, చినగంజాం మండలాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడం ఏమిటని ఎంఈఓలను ప్రశ్నించారు. మనసుపెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. డబ్బున్న వారు ఎక్కడైనా చదువుకుంటారని, డబ్బు లేని పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో అన్ని తరగతుల్లో నూరు శాతం అడ్మిషన్లు జరగాలన్నారు.
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం అనుమతించిన మేరకు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేయాలన్న వివరాలు అన్ని పాఠశాలల్లో అందరికీ కనిపించే విధంగా నోటీసు బోర్డుల్లో ఉంచాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా సౌకర్యాలు ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగితే విద్యార్థులు సురక్షితంగా బయట పడేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
తగిన వసతులు లేని పాఠశాలలకు నోటీసులిచ్చి 15 రోజుల్లో వసతులు ఏర్పాటు చేసుకునేందుకు గడువు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా స్పందించకుంటే ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసి మూతవేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఈఓ విజయభాస్కర్, రాజీవ్ విద్యామిషన్ పీఓ శ్రీనివాసరావు, ఒంగోలు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారులు సాల్మన్, రామమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో బోధన మెరుగుపర్చాలి
Published Sat, Jun 14 2014 2:37 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement