శృతి మించిన ప్రైవేట్‌ ఫీ‘జులుం’ | Corporate Educational Institutions Harassment For Fee Payment On Parents | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులపై కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యాసంస్థల తీవ్ర ఒత్తిడి

Published Thu, Feb 18 2021 1:42 AM | Last Updated on Thu, Feb 18 2021 8:15 AM

Corporate Educational Institutions Harassment For Fee Payment On Parents - Sakshi

ప్రైవేటు ఉద్యోగి అయిన వెంకటేశ్‌ లాక్‌డౌన్‌తో తన ఉద్యోగం కోల్పోయారు. 8 నెలలుగా అప్పులు చేస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ సమయంలో ఓ కార్పొరేట్‌ స్కూల్లో 10వ తరగతి చదివే అతని కొడుకు ధీరజ్‌ ఫీజును క్లియర్‌ చేయాలంటూ యాజమాన్యం నుంచి ఒత్తిడి పెరిగింది. రూ. 70 వేలుగా నిర్ణయించిన ఫీజులో గతంలోనే రూ. 35 వేలు చెల్లించినా, ఇప్పుడు మిగతా మొత్తం చెల్లిస్తేనే పరీక్ష ఫీజును తీసుకుంటామంటూ లంకె పెట్టింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక వెంకటేష్‌ అప్పుల వేటలో పడ్డారు.

శ్రీనివాస్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. తన కొడుకు శ్రీవత్సను ఓ కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివిస్తున్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో ఉన్న శ్రీవత్స ఫీజు రూ. 1.5 లక్షలు. గత జూలైలోనే రూ. 70 వేలు చెల్లించారు. అయితే కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల గత ఆగస్టులో శ్రీనివాస్‌ను ఆ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు ఆయన కుమారుడి ట్యూషన్‌ ఫీజు మొత్తం క్లియర్‌ చేస్తేనే వార్షిక పరీక్ష ఫీజు తీసుకుంటామని సదరు యాజమాన్యం మెలిక పెట్టింది. దీంతో శ్రీనివాస్‌ అప్పు కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: ఇది కేవలం వీరిద్దరి సమస్యే కాదు.. రాష్ట్రంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన లక్షల మంది అనుభవిస్తున్న క్షోభ. పిల్లల ఫీజుల కోసం అనేక తంటాలు పడాల్సి వస్తోంది. పరీక్షలు ముగిశాక టీసీ తీసుకునే సమయం లోపల.. ఫీజులు ఎలాగోలా చెల్లిస్తామంటున్నా యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు మొత్తం ట్యూషన్‌ ఫీజులు చెల్లిస్తేనే వారి పిల్లల పరీక్ష ఫీజులను తీసుకొని బోర్డుకు పంపిస్తామంటూ తెగేసి చెబుతుండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని బడా ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజుల కోసం తల్లిదండ్రులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇదివరకెన్నడూ లేని అసాధారణ పరిస్థితి కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించి కొంత వెసులుబాటు కల్పిం చాల్సింది పోయి... నిర్దయగా వ్యవహరిస్తు న్నాయి. ఈ విద్యాసంవత్సరం ఎక్కువకాలం ఆన్‌లైన్‌ క్లాసులతోనే గడిచిపోయింది కాబట్టి... నిర్వహణభారం పెద్దగా లేనందున ఫీజులనైనా ఎంతోకొంత తగ్గించాలని పేరెంట్స్‌ కోరుతున్నా యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. 

పూర్తి జీతాలు చెల్లించరు
రాష్ట్రంలో 1,586 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలుంటే అందులో కార్పొరేట్‌వే 700 పైగా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు 10 వేలకు పైగా ఉంటే అందులో 4 వేల వరకు బడా ప్రైవేటు స్కూళ్లు, మరో 2 వేల వరకు కార్పొరేట్‌ స్కూళ్లు ఉన్నాయి. కాలేజీల్లో క్యాంపస్, బ్రాంచీని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.85 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక స్కూళ్లలోనూ రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడిన క్రమంలో 75 శాతం సిబ్బందిని తొలగించి 25 శాతం సిబ్బందితోనే కొనసాగిస్తున్నాయి. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం ప్రత్యక్ష బోధన ప్రారంభం కావడం, పరీక్ష ఫీజుల చెల్లింపు సమయం రావడంతో తమ ప్రతాపం చూపుతున్నాయి. మూడు నెలల ప్రత్యక్ష బోధన పేరుతో తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి మరీ పూర్తి ఫీజులను వసూలు చేస్తున్నా.. ఆ 25 శాతం మంది సిబ్బందికైనా పూర్తి వేతనాలను చెల్లించడం లేదు. ఇక కొన్ని పాఠశాలలైతే ఫీజులను పెంచి మరీ వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

అడ్డగోలు ఫీజు వసూళ్లపై వందల సంఖ్యలో ఫిర్యాదులు
బడా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీల్లో అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఇటు పాఠశాల విద్యా శాఖకు, అటు ఇంటర్మీడియట్‌ బోర్డుకు రోజుకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటివరకు అందించిన ఫిర్యాదుల సంఖ్య వందల్లోనే ఉన్నట్లు తెలిసింది. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం కేవలం ట్యూషన్‌ ఫీజులను మాత్రమే తీసుకోవాలన్న నిబంధనల అమలును పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 

విద్యాశాఖకు అందిన ఫిర్యాదుల్లో కొన్ని...

  • రమేష్‌రెడ్డి అనే విద్యార్థి ఏకోల్‌ కిడ్స్‌ స్కూల్లో పీపీ–2 చదువుతున్నాడు. సదరు యాజమాన్యం ఆ విద్యార్థికి రూ. 37,500 ట్యూషన్‌ ఫీజుగా, రూ. 6,500 స్టూడెంట్‌ కిట్‌ ఫీజుగా నిర్ణయించింది. మొత్తం రూ. 44 వేలు చెల్లించాలని చెప్పింది. జూన్‌లో ఆన్‌లైన్‌ తరగతులను యాజమాన్యం ప్రారంభించింది. ఆ తరువాత మూడు టర్మ్‌లలో రూ. 32 వేలు చెల్లించారు. మిగతా రూ. 12 వేలు కూడా చెల్లించాలని యాజమాన్యం స్పష్టం చేసింది. తల్లిదండ్రులు మాత్రం తాము ట్యూషన్‌ ఫీజులో కట్టాల్సిన మిగతా మొత్తాన్నే చెల్లిస్తామని, స్టూడెంట్‌ కిట్‌ రూ. 6,500 చెల్లించమని తెలిపారు. దీంతో ఆ విద్యార్థికి ఆన్‌లైన్‌ తరగతులను కట్‌ చేశారు. ఈ విషయాన్ని తాము ప్రశ్నించినందుకు తమ కుమారుడి టీసీ తీసుకొని వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నారని, అదీ మిగతా రూ. 12 వేలు చెల్లిస్తేనే ఇస్తామంటూ ఇబ్బందులు పెడుతున్నారని రమేష్‌రెడ్డి తల్లి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు.
  • ప్రిన్సెస్‌ ఎస్సెన్‌ స్కూల్లో ఎల్‌కేజీ చదివే విద్యార్థికి రూ. 18 వేలు చెల్లించాలని, లేదంటే తమ స్కూల్‌ నుంచి విద్యార్థిని తొలగిస్తామని బెదిరిస్తోందంటూ విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. వారంలో మూడు ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే నిర్వహించారని, అందుకు సంవత్సరం మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఆ విద్యార్థి తండ్రి సజ్జద్‌ విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. 
  • వనస్థలిపురంలోని నారాయణ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి రూ. 1,00,500 చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని ఆ విద్యార్థి తరపున సురేష్‌ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 3 నెలల ప్రత్యక్ష బోధనకు అంత ఫీజు ఎలా చెల్లించాలని వాపోయారు. 

ఫీజులు కొంతశాతం తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి
వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మా పాప పదో తరగతి చదువుతోంది. 9వ తరగతిలో ట్యూషన్‌ ఫీజు రూ.40 వేల చొప్పున వసూలు చేయగా... ఈసారి పదోతరగతికి రూ.45 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. స్కూళ్లు తెరవకున్నా అదనంగా రూ.5 వేలు పెంచేశారు. ఇప్పటికే 30 వేలు ఫీజు చెల్లించాం. తగ్గించాలని కోరినప్పటికీ పూర్తి ఫీజు చెల్లించాలని, లేకుంటే తరగతులకు అనుమతించమని తేల్చిచెబుతున్నారు. జనవరి వరకు స్కూల్‌లో తరగతులు నిర్వహించనందున ఫీజు తగ్గించాలని కోరితే ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పామంటున్నారు. రెండ్రోజుల క్రితం మరో రూ.5వేలు చెల్లించా. పరీక్షలప్పుడు ఒత్తిడి చేసే అవకాశం ఉంది. పైసా తగ్గించకుండా దబాయిస్తున్నారు. ఫీజులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి కొంత శాతం తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలి. – సీహెచ్‌ లక్ష్మి, పదోతరగతి విద్యార్థిని తల్లి, ఎల్‌బీ నగర్

పది నెలలుగా సగం జీతమే...
లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటివరకు నాకు సగం జీతమే అందుతోంది. కానీ పని ఒత్తిడి మాత్రం మరింత పెరిగింది. ఆన్‌లైన్‌ క్లాసుల సమయంలో ప్రత్యేకంగా ఫోను, బోర్డు, స్టడీ మెటీరియల్‌ సొంత ఖర్చులతో కొనుగోలు చేశా. ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు ఇంటర్నెట్‌ ప్యాకేజీకి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేశా. స్కూల్‌ నడిచే రోజులతో పోలిస్తే ఇంకా అదనంగా పనిచేశా. పని ఒత్తిడి పెరిగినప్పటికీ వేతనం మాత్రం సగమే ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మా స్కూల్‌లో దాదాపు 80 శాతం టీచర్లను తొలగించగా... ఒకరిద్దరమే మిగిలాం. ఈనెల ఒకటో తేదీ నుంచి స్కూల్‌లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో పూర్తి వేతనం ఇవ్వాలని కోరగా... 60 శాతం మాత్రమే ఇవ్వగలమని మేనేజ్‌మెంట్‌ చెప్పింది. ప్రత్యామ్నాయం లేనందున తప్పని పరిస్థితిలో ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. – డి.నర్సింగ్‌రావు, కార్పొరేట్‌ స్కూల్‌ మ్యాథ్స్‌ ఫ్యాకల్టీ, చైతన్యపురి

కమిషనర్‌ దృష్టికి తీసుకెళతాం
పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థుల ట్యూషన్‌ ఫీజులను చెల్లిస్తేనే పరీక్షల ఫీజులను తీసుకుంటామని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వచ్చింది. దీనిపై పాఠశాల విద్యా కమిషనర్‌తో చర్చిస్తాం. ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం. – ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి

కచ్చితమైన ఫిర్యాదులు వస్తే చర్యలు
ట్యూషన్‌ ఫీజులకు, పరీక్ష ఫీజుకు లింకు పెట్టవద్దని ఆదేశాలు జారీ చేశాం. ముందుగా విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి పరీక్షలు రాసేందుకు ఇబ్బంది రాకుండా పరీక్ష ఫీజులను తీసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించాం. ఎవరైనా ట్యూషన్‌ ఫీజుకు, పరీక్ష ఫీజుకు లింకు పెట్టినట్లు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు చేపడతాం. జనరల్‌ ఫిర్యాదులు వచ్చాయి. కానీ కచ్చితమైన ఫిర్యాదులు చేయలేదు. అలా వస్తే చర్యలు చేపడతాం. – ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement