=ఎన్నో అవకాశాలు
=ప్రభుత్వ పథకాలు
=విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలు
ఏ దేశ అభివృద్ధి కైనా యువత పాత్రే కీలకం. అటువంటి యువతీ, యువకులు తమ కెరీర్ పట్ల ఎంతో శ్రద్ధ వహించాల్సిన తరుణమిది. ఒకప్పుడు డిగ్రీ వరకు చదివితే సరిపోయేది. ఇప్పుడు ఉన్నత చదువులతోపాటుగా సాఫ్ట్‌వేర్, తదితర కోర్సులు కూడా చేస్తే ఆకర్షణీయమైన వేతనం, గౌరవప్రదమైన జీవితం అందుబాటులోకి వస్తాయి. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం సాఫీగా సాగుతుంది. దీనితో మహిళలు కూడా పలు రంగాలలో విశేషంగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రభుత్వం అందిస్తున్న పలు విద్య, శిక్షణ, రుణ పథకాల గురించి తెలుసుకుందాం.
నిరుద్యోగులకు ఆసరాగా స్టడీసర్కిల్స్
నిరుపేద కుటుంబాలకు చెందిన బీసీ,ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పలు పోటీ పరీక్షలలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకుగాను నగరంలో రెండు స్టడీ సర్కిళ్లు నిర్వహిస్తున్నారు. గౌతు లచ్చన్న బీసీ స్టడీసర్కిల్, ఏపీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. గ్రూప్-1,గ్రూప్-2, సివిల్స్, బ్యాంక్ పీఓ, క్లర్క్, కానిస్టేబుల్, ఎస్‌ఐ,వీఆర్‌ఏ, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తారు. గ్రంథాలయ సదుపాయం కూడా ఉంది. బీసీ, ఈబీసీలకు రూ.లక్ష, ఎస్సీలకు రూ.2 లక్షల వార్షికాదాయం పరిమితి ఉంది. శిక్షణ కాలంలో స్టైఫెండ్, బుక్ అలవెన్స్ చెల్లిస్తారు. దూర ప్రాంత అభ్యర్థులకు హాస్టల్ సదుపాయం కూడా ఉంది. పూర్తి వివరాల కోసం బీసీ స్టడీసర్కిల్, బరోడా బ్యాంక్ మేడపై, సెక్టార్-6, ఎంవీపీ కాలనీ చిరునామాలో స్వయంగాను లేదా 0891-2564346 నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
రాజీవ్ యువ కిరణాలు
రాష్ట్ర ప్రభుత్వం 2011లో ఈ పథకం ప్రారంభించింది. పలురకాల కోర్సులలో యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 14,815 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు 4785 మందికి ఉపాధి కల్పించారు. ఎన్‌సీసీ, ఈడబ్ల్యుఆర్‌సి, యంపవర్, గ్రామ్‌తరంగ్, సాహితి, శ్రీరామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎస్‌ఎస్‌జీఎస్ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. శిక్షణ తరువాత రూ.5వేల నుంచి రూ.9వేల వంతున వేతనాలు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలలో మెప్మా, జీవీఎంసీ పరిధిలోయూసీడీ విభాగం ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. విద్యార్థులకు 40 శాతం హాజరు తప్పనిసరి.
రాజీవ్ యువశక్తి
రాజీవ్ యువశక్తి పథకం కింద నిరుద్యోగ యువతీయువకులకు సెట్విస్ సంస్థ రుణాలు ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 610 యూనిట్ల స్థాపనకుగాను రూ.6.10 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని సంకల్పించారు. ఇందులో 30 శాతం సబ్సిడీ కింద రూ.2 కోట్లు వ్యయం చేస్తారు. లబ్ధిదారులు తమ వాటా కింద రూ.10 లక్షలు భరించాల్సి ఉంటుంది. ఇక బ్యాంకులు 60 శాతం కింద రూ.4 కోట్ల రుణాలు ఇవ్వనున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 930 దరఖాస్తులు రాగా, 300 దరఖాస్తులను బ్యాంకులు ఆమోదించాయి. 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత దరఖాస్తుకి అర్హులు. ఒక్కో యూనిట్‌కి రూ.70వేల నుంచి రూ.1.8 లక్షల వరకు రుణాలు ఇస్తారు. స్వయం ఉపాధి పథకం కింద పాన్‌షాపులు, ఆటో, జెరాక్స్, స్టూడియో, షామియానా సప్లయర్స్ వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. గత ఏడాది లక్ష్యాన్ని మించి 524 యూనిట్లకు రుణాలు ఇవ్వడం విశేషం.
జనశిక్షణ సంస్థాన్
పిఠాపురం కాలనీ ఆంధ్రాబ్యాంక్ రోడ్డులో గల జనశిక్షణ సంస్థాన్‌లో పలు రకాల వృత్తివిద్యా కోర్సులలో అందుబాటు ఫీజులకే శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ఫ్రిజ్ , ఏసీ, కుట్టుమిషన్, రేడియో , టీవీ, గ్యాస్ స్టౌ, మోపెడ్ మెకానిజమ్, కంప్యూటర్ అప్లికేషన్- సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్-నెట్‌వర్క్, ప్రి-స్కూల్ టీచర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, డ్రెస్ మేకింగ్, ఎంబ్రాయిడరీ, ఆర్యావర్క్, యోగ, స్పోకెన్ ఇంగ్లిష్, డీటీపీ, ఫొటోషాప్, వెబ్‌డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్, లైబ్రరీసైన్స్, బ్యుటీషియన్, పైప్‌ఫిట్టర్-ప్లంబింగ్,ఎలక్ట్రీషియన్, బుక్‌బైండింగ్, తేలికపాటి వాహనాల డ్రైవింగ్, గ్లాస్, నిబ్ పెయింటింగ్, అకౌంటింగ్ ప్యాకేజీ, అగర్‌బత్తీ, కొవ్వొత్తులు, డ్రెస్ మేకింగ్, ఫస్ట్‌ఎయిడ్, హ్యాండీక్రాఫ్ట్స్ తదితర కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి నెలా 17వ తేదీన కొత్త బ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. రాయితీ బస్‌పాస్ సదుపాయం ఉంది. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గలవారు అర్హులు. ఆసక్తి గలవారు 0891-2553856 నంబర్ టెలిఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.