విశోక గీతం | MVVS murthy Died In Car Accident | Sakshi
Sakshi News home page

విశోక గీతం

Published Thu, Oct 4 2018 7:07 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

MVVS murthy Died In Car Accident - Sakshi

కుటుంబ సభ్యులతో ఎంవీవీఎస్‌ మూర్తి(ఫైల్‌)

విద్యార్థిగా ఇక్కడే చదువుకున్నారు.. న్యాయవాదిగా హైకోర్టుకు వెళ్లినా.. కొన్నాళ్లకే తిరిగొచ్చారు. స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అయినా.. విశాఖనే సొంతూరుగా మార్చుకున్నారు.. తన భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు. వ్యాపార రంగంపై మక్కువతో అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గోల్డ్‌స్పాట్‌ శీతలపానీయాల డిస్ట్రిబ్యూటర్‌గా ఆ రంగంలో అడుగుపెట్టి గోల్డ్‌స్పాట్‌ మూర్తిగా విశాఖ ప్రజలకు చిరపరిచితుడిగా మారిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి అమెరికాలోని అలస్కా ప్రాంతంలో దుర్మరణం పాలవ్వడం విశాఖను విషాదంలో నింపింది. 80లలో గీతం కళాశాల స్థాపించి దాన్ని డీమ్డ్‌ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లిన ఆయన దానికి అనుబంధం గీతం వైద్య, దంత వైద్య కళాశాలలను కూడా స్థాపించి విద్యాసంస్థల అధినేతగా.. గీతం మూర్తిగా సుప్రసిద్ధులయ్యారు.  1984లో రాజకీయాల్లో ప్రవేశించి రెండుసార్లు విశాఖ ఎంపీగా ఎన్నిక కావడంతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. విశాఖ నగరంతోపాటు ఎదుగుతూ తన సంస్థల ద్వారా కొన్నివేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మూర్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించిందని.. ఆయన ఇక లేరని తెలుసుకొని వేలా ది మంది ఆయన సిబ్బంది, ఆప్తులు, సన్నిహితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మృతికి సంతాప సూచకంగా గీతం విద్యాసంస్థలను మూసివేసి నివాళులర్పించారు.

సాగర్‌నగర్‌(విశాఖతూర్పు): ఎమ్మెల్సీ ఎంవీ వీఎస్‌ మూర్తి విశాఖ వాసులకు గీతం  మూర్తిగా సుపరిచితులు.  ఈనెల 6న కాలిఫోర్ని యాలో గీతం విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వెళ్లిన మూర్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందారు. తాను అభిమానించే గాంధీ జయంతి రోజే అనంత లోకా లకు వెళ్లడం యాదృశ్చికంగా జరిగినా విశేషమని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

మూర్తి ప్రస్థానం ఇలా..
మూర్తి 1938లో తూర్పుగోదావరి జిల్లా  అయినవిల్లి మండలం ఎస్‌.మూలపాలెంలో మతుకుమిల్లి పట్టాభిరామయ్య, మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. ఆయనకు సోదరి వీరరాఘవమ్మ. భార్య సావిత్రిదేవి, వీరికి కుమారులు రామారావు, లక్ష్మణరావు, కుమార్తె భారతి ఉన్నారు. వీరు ప్రారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నారు. సావిత్రిదేవి 2009లో కాలం చేశారు. మూర్తి మనవుడు భరత్‌కు సినీనటుడు బాలకృష్ణ చిన కుమార్తె తేజస్వితో వివాహం చేశారు. మూర్తికి దివంగత లోకసభ స్పీకర్‌  బాలయోగి, మాజీ ముఖ్య మంత్రులు ఎన్టీఆర్, నాదేండ్ల భాస్కరరావు, ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

విద్యాభ్యాసం సాగిందిలా..
అయినవిల్లి మండలం ఎస్‌.మూలపాలెంలో మూడో తరగతి వరకు మూర్తి చదివారు. కపిలేశ్వరపురంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, కాకినాడ పీఆర్‌ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చదివారు.డిగ్రీలో ఏయూ నుంచి బంగారు పతకం సాధించారు. ఆర్ధికశాస్త్రంలో పీహెచ్‌డీ డిగ్రీ పొందారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, అల్లాడి భాస్కరరావు, నల్లా సత్యనారాయణ, పిల్లా సూర్యనారాయణలతో కలిసి లా ప్రాక్టీస్‌ చేశారు. 1965లో లక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట వ్యాపారం ప్రారంభించి జిల్లాలోని కాకినాడ, మండపేట, రాజమండ్రి  తదితర ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. 1968లో వైజాగ్‌ బాట్లింగ్‌ కంపెనీ స్థాపించారు.  (గోల్డ్‌స్పాట్‌ కంపెనీ) అప్పటి నుంచి గోల్డ్‌ స్పాట్‌ మూర్తి గా పేరొచ్చింది. 1971 టెక్నో సంచుల ఫ్యాక్టరీ ప్రా రంభించారు. 1978లో టూత్‌ఫెస్టు ట్రస్టులో చురు కైన పాత్ర పోషించారు. 1980లో గీతమ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల స్థాపించారు. 2013లో గీతమ్‌ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. గీతంను ప్రగతి పథాన నడిపించి గోల్డ్‌స్పాట్‌ నుంచి గీతం మూర్తిగా మారిపోయారు.

రాజకీయ వేత్తగా..
1991, 1999లో వైజాగ్‌ ఎంపీగా చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన అవార్డు అందుకున్నారు.ఎన్టీఆర్‌ సమయంలో వుడా చైర్మన్‌గా పనిచేశారు.

విస్తరించిన విద్యాసంస్థలు
కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గీతం వర్సిటీ క్యాంప్‌లను అభివృద్ధి చేసి నైపుణ్యంతో కూడిన అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు అభివృద్ధి పరిచారు. పుస్తక పఠనం, పుస్తకాలంటే మూర్తికి ఎంతో ఇష్టం. ఇది మూర్తిలోని పట్టుదలకు నిదర్శనమని మూర్తి బంధువులు చెబుతున్నారు. మూర్తికి ఇష్టులైన మహాత్మ గాంధీ, మదర్‌ థెరిస్సా వంటి మహోన్నుతులు అంటే చాలా ఇష్టం. మహాత్మ గాంధీ పేరుతో గీతంలో ఒక స్టడీ సెంటర్‌ నెలకొల్పి ఆయనపై పరిశోధన అంశాలను నెలక్పొడం విశేషం. మూర్తి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

మహాత్మగాంధీ అంటే ఎంతో ఇష్టం
డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తికి మహాత్మగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆయన తన విద్యా సంస్థలకు జాతిపిత పేరు పెట్టుకున్నారు. గీతం విద్యాసంస్థలను గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఆయన 1980లో నగర శివారు రుషికొండలో ప్రారంభించారు. నాలుగు దశాబ్దాలుగా గీతం విశ్వవిద్యాలయం, తర్వాత డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వరకు ఎదిగింది.  

మృత్యువులోనూ వీడని బంధం
సాగర్‌నగర్‌ (విశాఖ తూర్పు): అమెరికాలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గీతం అధ్యక్షుడు డాక్టర్‌ మూర్తితోపాటు ఆయన చిరకాల మిత్రుడు వెలువోలు బసవపున్నయ్య కూడా కన్నుమూశారు. పున్నయ్య  జర్నలిస్టు, సామాజిక సేవారంగంలో ఉన్నారు. వెలువోలు ట్రస్టు పేరుతో ఆయన అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తికి ఎంతో సన్నిహింగా ఉంటూనే రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డితోనూ ఉండటం విశేషం. బసవపున్నయ్య మృతి పట్ల విశాఖలోని జర్నలిస్టు సంఘాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement