సాక్షి, అనంతపురం: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు పాఠశాలలను ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో తొలివిడతగా 1,236 స్కూళ్లను ఎంపిక చేశారు. ఇందులో 610 ప్రాథమిక, 289 ప్రాథమికోన్నత, 337 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ‘నాడు– నేడు’ కార్యక్రమం కింద తొమ్మిది రకాల వసతుల కల్పనకు చర్యలు తీసుకోనున్నారు. పరిపాలన అనుమతులు, ఇంజినీర్లు–పేరెంట్స్ కమిటీల మధ్య ఒప్పందాలు, బ్యాంకు ఖాతాలు తెరిపించే అంశాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
అంచనాలు సిద్ధం
నాడు–నేడు జిల్లాలో తొలి విడతగా 1,236 స్కూళ్లు ఎంపిక చేసిన అధికారులు ఇప్పటిదాకా 1,194 స్కూళ్లకు బ్యాంకు ఖాతాలు తెరిచారు. అలాగే 1,208 స్కూళ్లకు పరిపాల అనుమతులు లభించగా.. 1,190 స్కూళ్లలో పనులకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇక 1,126 స్కూళ్లలో వివిధ నిర్మాణ పనులకు భూమిపూజలు కూడా చేశారు. మొత్తంగా 1,210 స్కూళ్లలో చేయాల్సిన పనులకు సంబంధించిన అంచనాలు రూపొందించిన జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారులకు పంపారు. తక్కిన స్కూళ్లకు రెండుమూడు రోజుల్లో అంచనాలు, పరిపాలన అనుమతులు, ఒప్పందాలు, భూమిపూజలు, బ్యాంకు ఖాతాలు తెరిపించేలా చర్యలు తీసుకుంటామని సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శామ్యూల్ తెలిపారు.
నేరుగా ఖాతాల్లోకి నిధులు
పనులు ప్రారంభమైన తర్వాత సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. పనుల అంచనాల్లో తొలివిడతగా 15 శాతం నిధులు జమ చేస్తారు. పనులు, అంచనాల వివరాలను ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో రాష్ట్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. తర్వాత పనులు జరిగేకొద్దీ విడతల వారీగా నిధులు మంజూరు చేస్తారు.
నాడు-నేడుకు తొలి విడతలో 1,236 స్కూళ్లు
Published Fri, Jan 17 2020 8:31 AM | Last Updated on Fri, Jan 17 2020 8:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment