నాగరాజు దీక్ష భగ్నం
Published Sun, Sep 1 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
దొమ్మేరు (కొవ్వూరు రూరల్), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా కొవ్వూరు మండలం దొమ్మేరులో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు, రాష్ట్ర ఎంపీటీసీల చాంబర్ మాజీ అధ్యక్షుడు ముదునూరి నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు.
ఆగస్టు 27వ తేదీన దొమ్మేరు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన శిబిరంలో నాగరాజు ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సీఐ ఎం.బాలకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై బి.విజయ్‌కుమార్, సిబ్బంది దొమ్మేరులోని దీక్షా శిబిరానికి వెళ్లి దీక్షను విరమించాలని నాగరాజును కోరారు.
దీనికి ఆయన అంగీకరించలేదు. దీక్షను కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. అయినా పోలీసులు నాగరాజును దీక్షా శిబిరం నుంచి బలవంతంగా జీపులో ఎక్కించి కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ భాస్కరకుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాలని, లేకపోతే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని పోలీసులకు తెలిపారు. వారి సూచన మేరకు నాగరాజుకు సిలైన్లు ఎక్కించి దీక్షను భగ్నం చేశారు.
నాగరాజు దాదాపు 89 గంటలు ఆమరణ నిరహారదీక్ష చేశారు. దీక్షను భగ్నం చేయడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండి పట్టాభి రామారావు, పార్టీ నాయకులు వరిగేటి సుధాకర్, రుద్రం వీరబాబు తదితరులు శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని నాగరాజుకు సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement